జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌తో సీమ దశ మారిపోతుంది: మంత్రి నారా లోకేశ్
- సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్‌డబ్ల్యూ గ్రీన్ స్టీల్ ప్లాంట్ పనులకు చంద్రబాబు శ్రీకారం
- ప్రకటన విడుదల చేసిన నారా లోకేశ్
- సీమ దశాబ్దాల కలను నిజం చేస్తూ చారిత్రాత్మక అడుగు వేశామని వ్యాఖ్య
- ఈ ప్రాజెక్టుతో స్థానిక యువతకు వేలాది ఉద్యోగాలు లభిస్తాయని ధీమా
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీని ప్రగతి పథంలో నిలుపుతామన్న లోకేశ్
జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద 2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో జేఎస్‌డబ్ల్యూ గ్రీన్ స్టీల్ ప్లాంట్, 350 మెగావాట్ల సామర్థ్యంతో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్ పనులకు ఇవాళ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టడం తెలిసిందే. దీనిపై లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాయలసీమ ప్రాంతం ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నిలపాలన్న కూటమి ప్రజా ప్రభుత్వ ఉక్కు సంకల్పానికి ఈ స్టీల్ ప్లాంట్ నిదర్శనమని లోకేశ్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'తో రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలో నిలుపుతామని ఆయన స్పష్టం చేశారు.