ఏపీ మామిడి రైతులకు కేంద్రం గుడ్న్యూస్
- తోతాపురి రైతుల కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు
- ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించనున్న కమిటీ
- ధరలు తగ్గడానికి దారితీసిన కారణాలపైనా విశ్లేషణ
- పది రోజుల్లో క్షేత్రస్థాయి పర్యటనకు రానున్న కమిటీ
- రైతులు, పరిశ్రమతో సంప్రదింపులు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా తెలుసుకున్నారు. తోతాపురి మామిడి ధరలు భారీగా పడిపోవడంతో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. సాగు నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్, దేశీయ విక్రయాలు, ఎగుమతుల వరకు మొత్తం వ్యవస్థను కమిటీ సమీక్షించనుంది.
రాబోయే పది రోజుల్లో తోతాపురి మామిడి సాగు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కమిటీ సందర్శించనుంది. రైతులు, ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులు, ఎగుమతిదారులు, ఉద్యాన శాఖ అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించనుంది.
సాగు వ్యయం, రైతుల ఆదాయం, ప్రాసెసింగ్ సామర్థ్యం, డిమాండ్-సరఫరా పరిస్థితులు, దేశీయ, విదేశీ మార్కెట్లలో ధరలు పడిపోవడానికి గల కారణాలను కమిటీ పరిశీలించనుంది. అనంతరం రైతులకు మెరుగైన ధరలు లభించేలా, ఈ రంగాన్ని దీర్ఘకాలికంగా బలోపేతం అయ్యేలా కేంద్రానికి సమగ్ర నివేదిక అందజేయనుంది.