అమరావతి పేరుతో చేస్తున్న అప్పుల భారం చివరకు ప్రజలపైనే పడుతుంది: సజ్జల

Sajjala Ramakrishna Reddy says Amaravati debt burden will ultimately fall on the people
  • ఏపీ ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందన్న సజ్జల
  • అమరావతి కోసం మరో రూ. 2 లక్షల కోట్ల భారం మోపితే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్న
  • ప్రభుత్వాన్ని వైసీపీ ప్రశ్నిస్తూనే ఉంటుందన్న సజ్జల

రాజధాని అమరావతి అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం భారీ అప్పులు చేస్తోందని... ఈ భారం చివరికి రాష్ట్ర ప్రజల నెత్తినే పడబోతోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ధనంతో చేపట్టే ప్రతి ప్రాజెక్టుపై పారదర్శకత ఉండాలని అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు ప్రధాన ప్రతిపక్షంగా తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు.


రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధి చేయాల్సి ఉండగా... ప్రభుత్వం మాత్రం రైతులను చివరి ప్రాధాన్యతగా చూస్తోందని ఆరోపించారు. అమరావతిలో ఒక్క చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా రూ.20 వేల వరకు ఖర్చు చేస్తున్నారని... దీనిపై తాము సందేహాలు వ్యక్తం చేస్తే అధికార పక్షం సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని మండిపడ్డారు.


రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ.47 వేల కోట్ల వరకు అప్పులు తీసుకువచ్చిందని సజ్జల వెల్లడించారు. అంత భారీ నిధులను రాజధాని హంగులకే తగలేయకుండా... మచిలీపట్నం పోర్టు, కొత్త మెడికల్ కళాశాలలు, హంద్రీ-నీవా సుజల స్రవంతి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరేదని అభిప్రాయపడ్డారు. 


ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని... ఇలాంటి తరుణంలో రాజధాని కోసం మరో రూ.2 లక్షల కోట్ల అదనపు భారం మోపితే సామాన్యుడి పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 40 శాతం మంది ప్రజలు ఓటు వేసిన బలమైన పార్టీగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటుందని చెప్పారు.

Sajjala Ramakrishna Reddy
Amaravati Capital Debts
Andhra Pradesh Government Loans
YSRCP vs TDP Alliance
Amaravati Development Cost
Andhra Pradesh Pending Projects

More Telugu News