వేసవి సెలవులు ముగిసినా.. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

Tirumala Sarva Darshan takes 12 hours as pilgrim rush surges
  • దేశం నలుమూలల నుంచి తిరుమలకు భారీగా తరలివస్తున్న భక్తులు
  • టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,304 మంది భక్తులు

కలియుగ వైకుంఠమైన తిరుమల గిరుల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగిసినప్పటికీ... వీకెండ్స్ ప్రభావం, సాధారణ రోజుల్లో సైతం దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో శ్రీవారి క్షేత్రం జనసందోహంగా మారింది. ప్రస్తుతం టోకెన్లు లేని సామాన్య భక్తులకు స్వామివారి సర్వదర్శనం కలగడానికి దాదాపు 12 గంటల వరకు సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.


భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూ లైన్ వెలుపల ఉన్న నారాయణగిరి షెడ్ల వరకు కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 66,304 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,811 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.51 కోట్లు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది. 


క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న చిన్నపిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. టోకెన్లు లేకుండా నేరుగా తిరుమలకు వచ్చే భక్తులు ఈ వేచి ఉండే సమయాన్ని గమనించి, తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Tirumala
TTD
Tirupati Balaji Darshan
Sarva Darshan waiting time
Tirumala pilgrim rush
Lord Venkateswara temple

More Telugu News