14 రోజుల బ్యాటరీతో హువావే బ్యాండ్ 11 సిరీస్.. ధర ఫీచర్లివే..
- మార్కెట్లోకి మూడు మోడళ్లు
- 1.62 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే
- 100కు పైగా వర్కౌట్ మోడ్‌లు
- హార్ట్‌రేట్, ఎస్‌పీఓ2 ట్రాకింగ్
- ఆండ్రాయిడ్, ఐఓఎస్‌కు సపోర్ట్
హువావే భారత్‌లో బ్యాండ్ 11 సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో హువావే బ్యాండ్ 11, బ్యాండ్ 11 మెటల్, బ్యాండ్ 11 ప్రో మోడళ్లు ఉన్నాయి. బ్యాండ్ 11 ధర రూ.6,499 కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.3,999కు లభిస్తోంది. బ్యాండ్ 11 మెటల్ ధర రూ.7,999. బ్యాండ్ 11 ప్రో ధర రూ.8,999. సాధారణ మోడల్ ఏడు రంగుల్లో, ప్రో మోడల్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది.
మూడు మోడళ్లలోనూ 1.62 అంగుళాల అమోలెడ్ టచ్‌స్క్రీన్ ఇచ్చారు. 347 పీపీఐ పిక్సెల్ సాంద్రత, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే సపోర్ట్ ఉన్నాయి. ప్రో మోడల్‌లో గరిష్ఠంగా 2,000 నిట్స్, సాధారణ మోడల్‌లో 1,500 నిట్స్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ ఉండటంతో 50 మీటర్ల లోతు నీటి ఒత్తిడిని కూడా తట్టుకోగలదని కంపెనీ తెలిపింది.
హార్ట్‌రేట్ సెన్సార్, ఎస్‌పీఓ2 సెన్సార్‌తో గుండె స్పందన, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని నిరంతరం పర్యవేక్షించవచ్చు. స్లీప్ అనాలసిస్, హార్ట్ రేట్ వేరియబిలిటీ, ఒత్తిడి స్థాయి, నిద్రలో శ్వాస సమస్యలు, వ్యక్తిగత నిద్ర సూచనలు కూడా అందిస్తాయి. పల్స్ వేవ్ అరిథ్మియా డేటాను కూడా నమోదు చేస్తాయి.
100కు పైగా వర్కౌట్ మోడ్‌లు, 100కు పైగా వాచ్ ఫేస్‌లు ఇందులో ఉన్నాయి. జెశ్చర్ కంట్రోల్స్‌తో పాటు యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్‌ను కూడా అందించారు. బ్లూటూత్ 6.0, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై కనెక్టివిటీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 14 రోజుల బ్యాటరీ, సాధారణ వినియోగంలో 8 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.