ఏఐ ఎఫెక్ట్: పోవడం కాదు.. తొలి ఉద్యోగం దొరకడమే పెద్ద సవాలు!
- తొలి ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పెరుగుతోందన్న డబ్ల్యూఈఎఫ్ నివేదిక
- కొత్త నియామకాల వృద్ధి మందగించిందని వెల్లడి
- ఫైనాన్స్, ఐటీ రంగాలపై అధిక ప్రభావముందని స్పష్టీకరణ
- ఏఐ ఒక్కటే కారణం కాదన్న నివేదిక
- నైపుణ్యాలున్న వారికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని సూచన
ప్రపంచ ఆర్థిక వేదిక, పీడబ్ల్యూసీ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 37 శాతం మంది యువ ఉద్యోగులు ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండే రంగాల్లో పనిచేస్తున్నారు. తూర్పు ఆసియాలో ఈ సంఖ్య 75 శాతానికి, ఉత్తర అమెరికాలో 69 శాతానికి, యూరప్‌లో 63 శాతానికి చేరింది. ఫైనాన్స్, ఐటీ, కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ సేవలు, విద్యా రంగాలపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది.
2012 నుంచి చాలా రంగాల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు పెరిగాయి. కానీ, ఏఐ ప్రభావం అత్యధికంగా ఉన్న రంగాల్లో మాత్రం కొత్త నియామకాల సంఖ్య పెరగలేదని అధ్యయనం తెలిపింది. ఉద్యోగాలు పూర్తిగా మాయమవలేదు. కానీ కొత్త అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదని వెల్లడించింది. దీంతో గ్రాడ్యుయేట్ల మధ్య పోటీ మరింత పెరుగుతోందని పేర్కొంది.
ఉద్యోగాల మందగమనానికి ఏఐ ఒక్కటే కారణం కాదని నివేదిక స్పష్టం చేసింది. ఆర్థిక అనిశ్చితి, వ్యయ నియంత్రణ, కంపెనీల నియామక విధానాల్లో మార్పులు కూడా ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. చాలాసార్లు సంస్థలు ఏఐని కారణంగా చూపుతున్నప్పటికీ, వాస్తవానికి ఇతర ఆర్థిక కారణాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది.
ఏఐతో పనిచేసే నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు భవిష్యత్తులో ఎక్కువ అవకాశాలు ఉంటాయని నివేదిక సూచించింది. కొన్ని సంస్థలు ఇప్పటికే ఇంటర్న్‌షిప్‌లు, ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లో ఏఐ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. తొలి ఉద్యోగాలను తగ్గించడం కంటే, వాటిని కొత్త అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడమే సరైన మార్గమని ప్రపంచ ఆర్థిక వేదిక సూచించింది.