గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సిమోన్.. 36 ఏళ్ల నాటి ఫుట్‌బాల్ రికార్డు బద్దలు!

Unai Simon enters Guinness Book of World Records breaking 36-year-old football record
  • ఫిఫా వరల్డ్ కప్‌లో సుదీర్ఘ సమయం పాటు గోల్స్ కానివ్వకుండా అడ్డుకున్న ఉనై సిమోన్ 
  • 519 నిమిషాల పాటు ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్ కూడా చిక్కకుండా అడ్డుకున్న స్పెయిన్ షాట్-స్టాపర్ 
  • 1990 నాటి ఇటలీ లెజెండ్ వాల్టర్ జెంగా  రికార్డు బద్దలు 
  • 2022 ఖతార్ వరల్డ్ కప్ నుంచి 2026 వరల్డ్ కప్ వరకు ఐదు వరుస మ్యాచ్‌ల్లో క్లీన్ షీట్స్ 
  • స్పెయిన్ దిగ్గజం ఇకర్ కాసియాస్ రికార్డును కూడా అధిగమించిన సిమోన్
స్పెయిన్ స్టార్ గోల్‌కీపర్ ఉనై సిమోన్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరమైన 'ఫిఫా వరల్డ్ కప్'లో అత్యధిక నిమిషాల పాటు ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్ కూడా చిక్కకుండా అడ్డుకుని 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో తన పేరును నమోదు చేసుకున్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న 2026 మెగా టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాపై స్పెయిన్ 3-0 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కి చేరిన తరుణంలో ఈ రికార్డు అధికారికంగా నమోదైంది. సిమోన్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఏకంగా 519 నిమిషాల పాటు తన గోల్ పోస్ట్‌ను కాపాడుకుని, మూడు దశాబ్దాలుగా ఎవరికీ సాధ్యంకాని మైలురాయిని అధిగమించాడు.

36 ఏళ్ల నాటి ఇటలీ రికార్డు బద్దలు
ఇంతకుముందు ఈ ప్రపంచ రికార్డు ఇటలీకి చెందిన  గోల్‌కీపర్ వాల్టర్ జెంగా పేరిట ఉండేది. 1990 వరల్డ్ కప్‌లో అర్జెంటీనాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ 67వ నిమిషంలో గోల్ అయ్యే వరకు ఆయన రికార్డు 518 నిమిషాల పాటు సాగింది. తాజాగా ఆస్ట్రేలియాపై క్లీన్ షీట్ నమోదు చేయడంతో ఉనై సిమోన్ 519 నిమిషాలతో జెంగా రికార్డును దాటేశాడు. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అధికారికంగా ధ్రువీకరించింది.

 రెండు వరల్డ్ కప్‌ల ప్రయాణం 
ఉనై సిమోన్ సృష్టించిన ఈ అద్భుత రికార్డు రెండు ప్రపంచకప్‌ల ప్రయాణంతో ముడిపడి ఉంది:

2022 ఖతార్ వరల్డ్ కప్: డిసెంబర్ 1, 2022న జపాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్ 51వ నిమిషంలో జపాన్ ఆటగాడు అయో తనకా గోల్ చేసిన తర్వాత.. ఇప్పటివరకు సిమోన్‌ను మరే ఆటగాడూ అడ్డుకోలేకపోయారు. ఆ టోర్నీలో మొరాకోతో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో స్పెయిన్ పెనాల్టీ షూటౌట్‌లో ఓడిపోయినప్పటికీ, నిర్ణీత 120 నిమిషాల ఆటలో సిమోన్ ఒక్క గోల్ కూడా కానివ్వలేదు. (అక్కడే 159 నిమిషాల క్లీన్ షీట్ నమోదైంది).
2026 వరల్డ్ కప్: ఈ ప్రస్తుత ఎడిషన్‌లో కేప్ వర్దె, సౌదీ అరేబియా, ఉరుగ్వే రౌండ్ ఆఫ్ 32లో ఆస్ట్రేలియా జట్లతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ (మొత్తం 360 నిమిషాలు) సిమోన్ తన గోల్ పోస్ట్‌కు అభేద్యమైన గోడలా నిలిచారు.

దీనికంటే ముందే.. స్పెయిన్ ఫుట్‌బాల్ దిగ్గజం ఇకర్ కాసియాస్ 2010, 2014 వరల్డ్ కప్‌లలో నెలకొల్పిన 476 నిమిషాల జాతీయ రికార్డును కూడా ఉనై సిమోన్ అధిగమించడం విశేషం. ప్రపంచకప్ నాకౌట్ దశలో పోర్చుగల్‌తో తలపడనున్న స్పెయిన్ జట్టుకు సిమోన్ ఫామ్ కొండంత బలాన్ని ఇస్తోంది.
Unai Simon
Guinness World Record
FIFA World Cup 2026
Spain Football Team
Walter Zenga
Clean Sheet Record

More Telugu News