మంగళగిరి క్షేత్రానికి కొత్త శోభ.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్‌

Nara Lokesh lays foundation stone for Mangalagiri temple development works
  • మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి మంత్రి శంకుస్థాపన
  • రూ.6.3 కోట్ల దేవాదాయ శాఖ నిధులతో జీర్ణోద్ధరణ పనులు
  • నూతన యాగశాల, శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణకు శ్రీకారం
  • భక్తుల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు లోకేశ్‌ ఆదేశం
  • ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని మంత్రి సూచన
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి, జీర్ణోద్ధరణ పనులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ శ్రీకారం చుట్టారు. దిగువ సన్నిధిలో రూ.6.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక పనులకు ఆయన ఇవాళ‌ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా చారిత్రక కట్టడాల పునరుద్ధరణతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.

అంతకుముందు ఆలయానికి విచ్చేసిన మంత్రి లోకేశ్‌కు, అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నూతన యాగశాల నిర్మాణం, వాహనశాల, గంటా మండపం పునర్నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. చారిత్రక ప్రాధాన్యమున్న శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణ పనులను కూడా ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను పరిశీలించారు. ఆ తర్వాత మంత్రి లోకేశ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, రాజ్యలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా కలియతిరిగి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, ఆలయ సమగ్ర అభివృద్ధి కోసం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. చేపట్టే పనులన్నీ ఆలయ సంప్రదాయాలకు, ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, నిత్య ప్రసాద వితరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పుష్కరిణిని కూడా పరిశీలించి, దాని అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇచ్చారు.

దేవాదాయ శాఖ సమకూర్చిన రూ.6.3 కోట్ల నిధులతో ఈ అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా చారిత్రక శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణ, నూతన యాగశాల, గంటా మండపం, వాహనశాల పునర్నిర్మాణం వంటి ముఖ్యమైన పనులు జరగనున్నాయి. మంగళగిరి క్షేత్ర పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

కార్యక్రమం అనంతరం మంత్రి లోకేశ్‌ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. స్థానికులు, కార్యకర్తలతో కలిసి ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ ఈవో కోగంటి సునీల్ కుమార్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
Nara Lokesh
Mangalagiri Temple
Lakshmi Narasimha Swamy Temple
Temple development works
Andhra Pradesh Endowment Department
Mangalagiri temple restoration

More Telugu News