తెలంగాణ భవన్‌ వద్ద హైటెన్షన్‌.. పోలీసుల అదుపులో హరీశ్‌ రావు

High tension at Telangana Bhavan Harish Rao in police custody
  • గన్‌పార్క్‌కు వెళ్తుండగా తెలంగాణ భవన్‌ వద్ద హరీశ్‌రావును అడ్డుకున్న పోలీసులు
  • బీఆర్ఎస్‌ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత
  • కారు దిగి నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేసిన హరీశ్‌రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • గురుకులాల అవినీతి, రాష్ట్ర అప్పులపై చర్చకు మంత్రులు సవాల్‌
  • చర్చ నుంచి పారిపోవద్దని మంత్రులకు హరీశ్‌రావు ప్రతిసవాల్‌
గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పుల అంశాలపై చర్చించేందుకు గన్‌పార్క్‌కు బయల్దేరిన బీఆర్ఎస్‌ నేత హరీశ్‌రావును తెలంగాణ భవన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్‌ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చర్చకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు.

వాహనాన్ని నిలిపివేయడంతో హరీశ్‌రావు కాలినడకన గన్‌పార్క్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో హరీశ్‌రావు కిందపడిపోయారు. అనంతరం పోలీసులు ఆయన్ను, పలువురు బీఆర్ఎస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. తమ నేతను అడ్డుకోవడంపై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు రావాలని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు. గన్‌పార్క్‌ వద్ద తాము సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. దీన్ని స్వీకరించిన హరీశ్‌రావు, తామే అక్కడికి వస్తున్నామని చెప్పారు. చర్చ నుంచి పారిపోవద్దని మంత్రులకు సవాల్‌ విసురుతూ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే అనుమతి లేకపోవడంతో పోలీసులు ఆయన్ను గన్‌పార్క్‌కు వెళ్లనీయకుండా అదుపులోకి తీసుకున్నారు.
Harish Rao
Telangana Bhavan
BRS Party
Gun Park Protest
Telangana Police
Gurukul Corruption

More Telugu News