తమిళనాడులో గోవధపై హైకోర్టు నిషేధాన్ని సుప్రీంలో సవాల్ చేసిన విజయ్ ప్రభుత్వం
- హైకోర్టు తీర్పు 1958 జంతు సంరక్షణ చట్టానికి విరుద్ధంగా ఉందని ప్రభుత్వ వాదన
- ఈ తీర్పు మతస్వేచ్ఛను హరిస్తోందని ప్రతిపక్షాలు, ముస్లిం సంఘాల ఆందోళన
- బక్రీద్, హిందూ పండుగల్లో జంతుబలులపై ప్రభావం చూపుతున్న తీర్పు
- సుప్రీంను ఆశ్రయించడంలో జాప్యంపై టీవీకే ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
ప్రభుత్వ వాదనలు ఇవే..
మే 27న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. 'తమిళనాడు జంతు సంరక్షణ చట్టం-1958' నిబంధనలకు విరుద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ చట్టం ప్రకారం పదేళ్లు దాటిన, వ్యవసాయ పనులకు లేదా సంతానోత్పత్తికి పనికిరావని పశువైద్య అధికారి ధ్రువీకరించిన ఆవులను వధించేందుకు అనుమతి ఉంది. అయితే, హైకోర్టు తీర్పు ఈ చట్టాన్ని పట్టించుకోకుండా, రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధించిందని ప్రభుత్వం తన అప్పీల్‌లో పేర్కొంది. వాస్తవానికి, కోయంబత్తూరులో బక్రీద్ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో జంతువధను నిరోధించాలని మాత్రమే కోర్టులో పిటిషన్ దాఖలైందని, కానీ హైకోర్టు తన పరిధిని దాటి రాష్ట్రవ్యాప్త నిషేధానికి ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వం వివరించింది.
మత స్వేచ్ఛకు భంగం..
బక్రీద్ లేదా మరే ఇతర రోజుల్లోనూ ఆవులు, దూడలను వధించకుండా చూడాలని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు కేవలం బక్రీద్ పండుగకే కాకుండా రాష్ట్రంలోని హిందూ దేవాలయాల్లో జరిగే జంతుబలులపై కూడా ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. పండుగల సమయంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా లైసెన్స్ ఉన్న స్లాటర్‌హౌస్‌లలో వసతి కల్పించడం అసాధ్యమని, చాలా వాటికి అంత సామర్థ్యం లేదని పలువురు సామాజిక నాయకులు అంటున్నారు. ఎంఎంకే అధ్యక్షుడు ఎం.హెచ్. జవహిరుల్లా ఈ తీర్పును బాధాకరం అని అభివర్ణిస్తూ, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం పౌరులకు హామీ ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడమేనని అన్నారు.
ప్రతిపక్షాల విమర్శలు
ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడంలో టీవీకే ప్రభుత్వం జాప్యం చేసిందని ప్రతిపక్ష డీఎంకే విమర్శించింది. డీఎంకే ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. "పాలిచ్చే ఆవులను ఆర్థిక కారణాల వల్ల ఎవరూ వధించరు. ఈ తీర్పు కేవలం ఆవులకే కాకుండా ఎద్దులు, గేదెల వధను కూడా నిషేధిస్తోంది. ఇది ముస్లింలకే కాదు, ఆలయాల్లో బలులు ఇచ్చే హిందువుల ఆచారాలపైనా ప్రభావం చూపుతుంది" అని అన్నారు.
ప్రభుత్వం నుంచి వస్తున్న జాప్యంపై స్పందించిన టీవీకే వర్గాలు.. "న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు కొంత సమయం పట్టింది" అని వివరణ ఇచ్చాయి. ప్రస్తుతం ఉన్న చట్టాలు జంతువధకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను నిర్దేశిస్తున్నాయని, హైకోర్టు తీర్పు 'జ్యుడీషియల్ లెజిస్లేషన్' (న్యాయవ్యవస్థ చట్టాలను రూపొందించడం) కిందకు వస్తుందని ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన వాదనను వినిపించింది.