పీఎఫ్ విత్‌డ్రా నిబంధనల్లో కీలక మార్పులు.. అమల్లోకి వచ్చిన ఈ కొత్త నియమాలు తెలుసుకోండి!

EPFO New PF Withdrawal Rules 2026 and Key Changes
  • పీఎఫ్ పాక్షిక విత్‌డ్రాలకు అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
  • ఖాతాలో 25 శాతం కనీస బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరి
  • యూపీఐ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి పీఎఫ్ డబ్బులు పొందే సౌకర్యం
  • వాట్సాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్ తెలుసుకునే సేవలు త్వరలో ప్రారంభం
  • వివాహం, విద్య, వైద్యం కోసం అర్హత బ్యాలెన్స్‌లో 100 శాతం విత్‌డ్రాకు అనుమతి
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నగదు ఉపసంహరణ (విత్‌డ్రా) నిబంధనలను సవరిస్తూ 'ఉద్యోగుల భవిష్య నిధి పథకం, 2026'ను నోటిఫై చేసింది. జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం, పీఎఫ్ ఖాతా నుంచి పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేయాలంటే, ఖాతాలో కనీసం 25 శాతం బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరి. ఉద్యోగి, యాజమాన్యం వాటాలు రెండింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది.

ఈ కొత్త నియమం ప్రకారం విత్‌డ్రాకు అందుబాటులో ఉండే మొత్తాన్ని లెక్కించే ముందు ఈ కనీస బ్యాలెన్స్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒకరి ఖాతాలో రూ.1 లక్ష అర్హత మొత్తం ఉంటే, అందులో రూ.25,000 కనీస బ్యాలెన్స్‌గా ఉంచి, మిగిలిన రూ.75,000 నుంచే పథకం నిబంధనలకు లోబడి విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 25 శాతం తప్పనిసరి బ్యాలెన్స్‌ను తీసివేయగా మిగిలిన మొత్తాన్నే 'అర్హత ఉన్న సభ్యుని బ్యాలెన్స్' (Eligible Member Balance)గా ఈపీఎఫ్ఓ నిర్వచించింది.

విత్‌డ్రా కారణాలు.. కొత్త సేవలు
కొత్త పథకం కింద పాక్షిక విత్‌డ్రాలకు అనుమతించే కారణాల జాబితాను కూడా విస్తరించారు. గృహ సంబంధిత అవసరాలైన ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు, ఇంటి నిర్మాణానికి స్థలం కొనుగోలు, గృహ నిర్మాణం, గృహ రుణం తిరిగి చెల్లించడం, ఇంటి మరమ్మతులు లేదా ఆధునీకరణ వంటి వాటికి నిధులు డ్రా చేసుకోవచ్చు. వీటితో పాటు అనారోగ్యం, పిల్లల ఉన్నత విద్య, వివాహం వంటి ఖర్చుల కోసం 'అర్హత ఉన్న బ్యాలెన్స్‌'లో 100 శాతం వరకు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఉద్యోగంలో చేరిన 12 నెలల తర్వాత పాక్షిక విత్‌డ్రాలకు అర్హత లభిస్తుంది. ప్రత్యేక పరిస్థితుల్లో విత్‌డ్రా చేసుకునేందుకు అదనపు వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు.

మరోవైపు ఈపీఎఫ్ఓ తన సేవలను మరింత సులభతరం చేసేందుకు సాంకేతికతను జోడిస్తోంది. త్వరలోనే చందాదారులు తమ పీఎఫ్ డబ్బులను నేరుగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా తమ బ్యాంకు ఖాతాల్లోకి పొందే సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. దీనికి సంబంధించిన టెస్టింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ విధానం ద్వారా 7 కోట్లకు పైగా సభ్యులకు సేవలు వేగంగా, సులభంగా అందనున్నాయి.

అంతేగాక మరో నెల రోజుల్లో వాట్సాప్ ద్వారా కూడా కీలక సేవలను ప్రారంభించాలని ఈపీఎఫ్ఓ యోచిస్తోంది. ఈపీఎఫ్ఓ వెరిఫైడ్ వాట్సాప్ నంబర్‌కు 'హలో' అని మెసేజ్ పంపడం ద్వారా చందాదారులు సేవలు పొందవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, చివరి ఐదు లావాదేవీల వివరాలు, క్లెయిమ్ స్టేటస్ ట్రాకింగ్ వంటివి వాట్సాప్‌లోనే తెలుసుకోవచ్చు. ఈ సేవలను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానుండటం విశేషం. ఒకవైపు విత్‌డ్రా నిబంధనలను కఠినతరం చేస్తూనే, మరోవైపు సాంకేతికత సాయంతో సేవలను సులభతరం చేయడం ద్వారా సభ్యులకు మెరుగైన అనుభవాన్ని అందించాలని ఈపీఎఫ్ఓ లక్ష్యంగా పెట్టుకుంది.
EPFO
EPF withdrawal rules 2026
PF partial withdrawal conditions
EPFO WhatsApp services
EPF UPI payment system
Employees Provident Fund balance

More Telugu News