అంటార్కిటికాలో ‘రక్త జలపాతం’.. ఎరుపు రంగు వెనక అసలు కథ ఇదే!
- అంటార్కిటికాలోని ‘బ్లడ్ ఫాల్స్’పై వందేళ్లుగా మిస్టరీ
- ఇనుము అధికంగా ఉన్న ఉప్పునీరు గాలితో చర్య జరపడం వల్లే ఎరుపు రంగు
- ఈ నీటి మూలం గ్లేసియర్ కింద 15 లక్షల ఏళ్ల నాటి పురాతన సరస్సు
- గ్లేసియర్‌లోని పగుళ్లు, రహస్య మార్గాల గుండా నీరు పైకి
- మంచు కింద లక్షల ఏళ్లుగా సూక్ష్మజీవులు జీవిస్తున్న వైనం
అసలు రహస్యం ఇదే
అంటార్కిటికాలోని టేలర్ గ్లేసియర్ నుంచి ప్రవహించే ఈ జలపాతాన్ని ‘బ్లడ్ ఫాల్స్’ అని పిలుస్తారు. దీని ఎరుపు రంగుకు కారణం ఇనుము అధికంగా ఉన్న అత్యంత ఉప్పునీరు. మంచు అడుగున ఉన్న ఈ నీరు బయటకు వచ్చిన వెంటనే గాలిలోని ఆక్సిజన్‌తో ప్రతిచర్య జరిపి తుప్పు రంగులోకి మారుతుంది. అందుకే ఈ జలపాతం రక్తంలా ఎర్రగా కనిపిస్తుంది.
15 లక్షల ఏళ్ల నాటి సరస్సు
ఈ నీటి మూలం టేలర్ గ్లేసియర్ కింద సుమారు 400 మీటర్ల లోతులో ఉన్న పురాతన సరస్సు. దాదాపు 15 లక్షల సంవత్సరాల క్రితం సముద్రపు నీరు మంచు కింద చిక్కుకుపోయి, కాలక్రమంలో మరింత ఉప్పుగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉండటంతో తీవ్ర చలిలో కూడా ఈ నీరు గడ్డకట్టకుండా ద్రవరూపంలోనే ఉంటుంది.
1911లో ఆస్ట్రేలియా భూగర్భ శాస్త్రవేత్త గ్రిఫిత్ టేలర్ ఈ జలపాతాన్ని తొలిసారి గుర్తించారు. అప్పట్లో ఎరుపు రంగుకు ఆల్గే కారణమని భావించారు. కానీ తర్వాతి పరిశోధనల్లో అది తప్పని తేలింది. 2017లో అలాస్కా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రాడార్ సాయంతో గ్లేసియర్‌లోని రహస్య మార్గాలను గుర్తించారు. ఒత్తిడికి గురైన ఉప్పునీరు ఆ మార్గాల గుండా పైకి వచ్చి బ్లడ్ ఫాల్స్‌గా బయటపడుతుందని వెల్లడించారు.
తాజాగా ‘అంటార్కిటిక్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం మరో కీలక విషయాన్ని బయటపెట్టింది. గ్లేసియర్‌లో ఏర్పడే చిన్న చిన్న పగుళ్ల ద్వారానే ఈ ఉప్పునీరు అప్పుడప్పుడు బయటకు వస్తోందని పరిశోధకులు గుర్తించారు. దీంతో శతాబ్దకాలంగా కొనసాగుతున్న ఈ ప్రకృతి రహస్యానికి మరింత స్పష్టత లభించింది.
సూర్యకాంతి లేకుండానే జీవం
అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఉప్పునీటిలో సూర్యకాంతి, ఆక్సిజన్ లేకుండా లక్షల ఏళ్లుగా సూక్ష్మజీవులు జీవిస్తున్నాయి. కాంతి లేకుండానే రసాయన చర్యల ద్వారా అవి జీవిస్తుండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. భూమి వెలుపల మంచుతో కప్పి ఉన్న గ్రహాలు, ఉపగ్రహాలపై కూడా ఇలాంటి పరిస్థితుల్లో జీవం ఉండే అవకాశాలను అర్థం చేసుకోవడంలో ఈ పరిశోధన కీలకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.