ప్రతి చిన్న విషయానికీ కంప్లైంట్‌ చేస్తున్నారా? మీ మెదడులో జరిగేది ఇదే..!

Are you complaining about every small thing This is what happens in your brain
  • తరచూ ఫిర్యాదు చేస్తే మెదడుపై ప్రతికూల ప్రభావం
  • కంప్లైంట్‌లు ఒత్తిడి హార్మోన్లను పెంచుతాయని వెల్లడి
  • దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత దెబ్బతినే అవకాశం
  • హిప్పోక్యాంపస్‌పై కూడా ప్రతికూల ప్రభావం ఉండొచ్చని న్యూరో సర్జన్ సూచన
  • ఫిర్యాదులను తగ్గించి సానుకూల దృక్పథం పెంచుకోవాలని సలహా
కొంతమంది ప్రతి చిన్న విషయానికీ ఫిర్యాదు చేస్తుంటారు. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చిరాకు పడుతుంటారు. వారిలో ఇది ఒక అలవాటుగా మారిపోయి ఉంటుంది. అయితే ఇది కేవలం మనసుకే కాదు, మెదడు ఆరోగ్యానికీ హానికరమని బెంగళూరుకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డా. ప్రశాంత్ కటాకోట్ హెచ్చరిస్తున్నారు. తరచూ కంప్లైంట్‌ చేయడం వల్ల మెదడు నెగెటివ్‌గా ఆలోచించేలా అలవాటు పడుతుంది. కాలక్రమంలో ప్రతి విషయంలోనూ లోపాలే కనిపించే పరిస్థితి ఏర్పడుతుంది.

డాక్టర్ తెలిపిన ప్రకారం.. తరచూ ఫిర్యాదులు చేస్తుంటే శరీరంలో కార్టిసాల్‌ వంటి ఒత్తిడి హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి. దీంతో మానసిక ప్రశాంతత తగ్గడమే కాకుండా ఏకాగ్రత, రోగనిరోధక శక్తిపైనా ప్రభావం పడుతుంది. దీర్ఘకాలం ఇదే అలవాటు కొనసాగితే జ్ఞాపకశక్తికి కీలకమైన హిప్పోక్యాంపస్‌ భాగం క్రమంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫలితంగా నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గవచ్చు.

ఈ అలవాటును మార్చుకోవాలంటే ముందుగా తాము ఫిర్యాదు చేస్తున్నామనే విషయాన్ని గుర్తించాలి. అలాంటి సమయంలో కాసేపు ఆగి ప్రశాంతంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. సమస్యలను పట్టించుకోకుండా ఉండమని కాదు.. వాటిని చూసే దృక్పథాన్ని మార్చుకోవాలి. ఫిర్యాదులు తగ్గితే మెదడు కూడా క్రమంగా కోలుకుని, జీవితంలో ఆనందం పెరుగుతుంది.
Complaining
Brain health
Mental health
Cortisol stress hormone
Psychology
Hippocampus

More Telugu News