ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: హీరో కొత్త సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన

Chandrababu Naidu Lays Foundation for Hero MotoCorp New Center in Sri City
  • శ్రీసిటీలో హీరో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0కి శంకుస్థాపన
  • రూ.3,200 కోట్ల పెట్టుబడులు వేగవంతం చేయాలని సూచన
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బదులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామన్న వ్యాఖ్య
  • అమరావతిలో క్వాంటం కంప్యూటర్, కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని ప్రకటన
  • సంపద సృష్టిస్తూ పేదలకు ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం
శ్రీసిటీలోని హీరో మోటోకార్ప్ తయారీ కేంద్రంలో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై తమ ప్రభుత్వం స్పష్టమైన దార్శనికతను వివరించారు. గతంలో తాము ప్రత్యేక చొరవ చూపి, చర్చలు జరిపి హీరో మోటోకార్ప్ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

హీరో సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్‌ను జాతి నిర్మాణానికి సహకరించిన మహనీయుడిగా ముఖ్యమంత్రి కొనియాడారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పవన్ ముంజాల్ పేర్కొన్న విధంగా రూ. 3,200 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆయన కోరారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని, మారుతున్న కాలానికి అనుగుణంగా 'వీడా' బ్రాండ్‌తో హీరో సంస్థ సిద్ధంగా ఉండాలని సూచించారు. తిరుపతి మహిళా పోలీసులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించినందుకు సంస్థ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో గతంలో 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' గురించి చర్చేంచేవారమని, అయితే ఇప్పుడు 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని అమలు చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో త్వరలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని, ఎల్లుండి కడప స్టీల్ ప్లాంట్ పనులను పునఃప్రారంభించబోతున్నామని ప్రకటించారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోందని వెల్లడిస్తూ, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంపద సృష్టిస్తూనే, ఆ ఫలాలను పేదలకు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్యాంకు రుణాలను క్రమశిక్షణతో తిరిగి చెల్లిస్తూ, డ్వాక్రా మహిళలు నేడు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతుండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Chandrababu Naidu
Hero MotoCorp
Sri City
Speed of Doing Business
Andhra Pradesh Industrial Growth
Global Parts Center 2.0

More Telugu News