ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త.. యోనోలో ఏఐతో సరికొత్త సేవలు

SBI Good News for Customers New AI Services in YONO
  • యోనో ప్లాట్‌ఫామ్‌పై ఏఐ ఆధారిత కొత్త ఫీచర్లను ప్రారంభించిన ఎస్‌బీఐ
  • ఒకేసారి సేవింగ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తెరిచేందుకు అవకాశం
  • కార్పొరేట్ కస్టమర్ల కోసం యోనో బిజినెస్‌లో ట్రేడ్ ఫైనాన్స్ సేవలు
  • దేశంలోనే తొలిసారిగా 'సస్టైనబిలిటీ జర్నీ' ఫీచర్ పరిచయం
  • వినియోగదారుల కోసం 'యోనో జీ' పేరుతో ఏఐ వర్చువల్ అసిస్టెంట్
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), తన 71వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కీలక ప్రకటన చేసింది. తమ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'యోనో' (యోనో)లో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నూతన సేవలను ప్రారంభించినట్లు వెల్లడించింది. సుమారు 53 కోట్ల మంది ఖాతాదారులకు బ్యాంకింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు, అత్యాధునిక సాంకేతికతను చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ఆవిష్కరణలు చేపట్టినట్లు బ్యాంకు తెలిపింది.

రిటైల్ కస్టమర్ల కోసం యోనో యాప్‌లో సరికొత్త 3-ఇన్-1 సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా కొత్త వినియోగదారులు బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పొదుపు ఖాతాతో పాటు ఎస్‌బీఐక్యాప్ సెక్యూరిటీస్‌లో డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను ఏకకాలంలో ప్రారంభించవచ్చు. అలాగే, వినియోగదారుల ఆర్థిక లావాదేవీలను విశ్లేషించి, మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేందుకు సహకరించే 'ఫైనాన్షియల్ ఫిట్‌నెస్' స్కోర్‌ను సైతం ఎస్బీఐ పరిచయం చేసింది.

దేశంలోనే తొలిసారిగా 'సస్టైనబిలిటీ జర్నీ' అనే వినూత్న ఫీచర్‌ను ఎస్‌బీఐ ఆవిష్కరించింది. దీని ద్వారా డిజిటల్ లావాదేవీలు వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాన్ని (కార్బన్ ఉద్గారాల తగ్గింపు) వినియోగదారులు నేరుగా తెలుసుకోవచ్చు. ఇక కార్పొరేట్, ఎంఎస్‌ఎంఈ కస్టమర్ల కోసం 'యోనో బిజినెస్' మొబైల్ యాప్‌లో పూర్తిస్థాయి ట్రేడ్ ఫైనాన్స్ సేవలను అనుసంధానించడమే కాకుండా, వారికి 24/7 సహాయం అందించేందుకు 'యోనో జీ' పేరుతో ఏఐ వర్చువల్ అసిస్టెంట్‌ను ప్రారంభించింది.

ఈ సందర్భంగా ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ, "కృత్రిమ మేధ, డిజిటల్ ఆవిష్కరణల ద్వారా బ్యాంకింగ్ సేవలను మరింత సరళీకృతం చేయాలన్న మా అంకితభావానికి ఈ నూతన సేవలే నిదర్శనం. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా బ్యాంకింగ్ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు మా వంతు కృషి చేస్తున్నాం" అని పేర్కొన్నారు.
State Bank of India
SBI YONO App
SBI AI Services
SBI 3 in 1 Account
Challa Sreenivasulu Setty

More Telugu News