ఆధారాలు లేని ఆరోపణలు సహించం.. సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ హెచ్చరిక!
- వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయొద్దని పవన్ హెచ్చరిక
- ఆధారాలు లేని ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు సహించబోమని స్పష్టం
- సైబర్ వేధింపుల బాధితుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు
- ఆధారాలతో ఫిర్యాదు చేస్తే బీఎన్‌ఎస్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు
మత విశ్వాసాలను దెబ్బతీయడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని పవన్ అన్నారు. వ్యక్తిగత దూషణలు, చంపేస్తామని బెదిరించడం, దేవుళ్లు, దేవతలపై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. నిర్మాణాత్మక విమర్శలను ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతిస్తుందని చెప్పారు.
సైబర్ వేధింపులు, పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసే చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని పవన్ పేర్కొన్నారు. నేరస్థులకు కులం, మతం ఉండదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బాధితులు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై బీఎన్‌ఎస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.