కుప్పంలో జూలై 3-5 వరకు మూడు రోజులు పర్యటించనున్న ముఖ్యమంత్రి
- అభివృద్ధి సహా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- రూ.3847 కోట్ల విలువైన పెట్టుబడులకు శంకుస్థాపనలు చేయనున్న ముఖ్యమంత్రి
- ముఖ్యమంత్రి సమక్షంలో రూ.1026 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంఓయూలు
- ఎంఎస్ఎంఈ పార్క్, కడా గెస్ట్ హౌస్ ప్రారంభం
- కుప్పం బస్టాండ్, డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేయనునన్న ముఖ్యమంత్రి
పర్యటనలో భాగంగా తొలిరోజు గుడిపల్లె మండలం పొగురుపల్లెలో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. సుమారు రూ. 3,847 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న 12 పరిశ్రమలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ పరిశ్రమల ద్వారా దాదాపు 23 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే, మరో రూ. 1,026 కోట్ల పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి సమక్షంలో అధికారులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. వీటితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
అబీస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించిన చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం 200 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం మంజూరు చేసిన రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్లను ఆయన ప్రారంభించనున్నారు. అదేవిధంగా, పీఎంఏవై పథకం కింద నిర్మించిన 5,179 గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. కుప్పం ప్రాంతంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుపై పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమవుతారు. చివరగా, పొగురుపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.