రాష్ట్రాభివృద్ధి, తెలుగువారిని అందలం ఎక్కించటమే కూటమి లక్ష్యం: చంద్రబాబునాయుడు

Chandrababu Naidu says alliance goal is state development and elevating Telugu people
  • పొదుపులో మన డ్వాక్రా మహిళలు దేశానికే ఆదర్శమన్న ముఖ్యమంత్రి
  • నేరస్థులకు వంతపాడే రాజకీయ పార్టీలు మనకెందుకు వ్యాఖ్య
  • సైకో సహకారంతోనే గొడ్డలి పార్టీ నేతల మాటలు, చేతలు అని ఆగ్రహం
  • మావిగన్ అన్న వ్యక్తులు రాజధానికి రౌడీల్లా దండయాత్రలు చేస్తున్నారన్న సీఎం
  • నెల్లూరు జిల్లా పున్నపువారిపల్లెలో పేదల సేవలో కార్యక్రమంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్రాభివృద్ధితో పాటు తెలుగువారిని ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాభీష్టానికి అనుగుణంగానే సుపరిపాలన అందిస్తున్నామని, ప్రజల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారిపాలెంలో బుధవారం జరిగిన 'పేదల సేవలో' కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "ప్రజలు చూపిస్తున్న అమితమైన అభిమానం చూస్తుంటే, పడుతున్న కష్టమంతా మర్చిపోతున్నాం. గత పాలకులు నెల్లూరు జిల్లాను అత్యంత అశాస్త్రీయంగా విభజించారు. గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని ఇచ్చిన హామీని మేము నెరవేర్చాం. సైదాపురం, కలవాయి మండలాలను కూడా తిరిగి నెల్లూరు జిల్లాలోనే విలీనం చేశాం. పరిపాలన అనేది ప్రజల అభీష్టం మేరకే సాగాలి తప్ప, పెత్తందారీ పోకడలకు ఇక్కడ తావులేదు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సవరించాం. ప్రజల జీవితాల్లో సుస్థిరమైన మార్పు తీసుకురావాలన్నదే మా ధ్యేయం.

సామాజిక బాధ్యతగా ప్రతి నెలా ఒకటో తేదీన నిరుపేదలకు, ఆపన్నులకు పెన్షన్ అందిస్తున్నాం. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులతో పాటు మొత్తం 28 కేటగిరీల లబ్ధిదారులకు పింఛను అందజేస్తూ వారిని ఆదుకుంటున్నాం. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పీ4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ రూ.68,598 కోట్ల మేర పెన్షన్లను పంపిణీ చేసింది. ప్రతీ నెలా 62.20 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,712 కోట్లు చొప్పున చెల్లిస్తున్నాం" అని ముఖ్యమంత్రి వివరించారు.

పొదుపు ఉద్యమానికి డ్వాక్రా మహిళలే దిక్సూచి

గడిచిన రెండేళ్ల ప్రయాణంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటంతో పాటు వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టామని, ఎదురైన సంక్షోభాలు, సమస్యలను దాటుకుని ప్రజలకు మేలు చేసేలా అనునిత్యం పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. "గత పాలకులు ఐదేళ్ల పాటు విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కేవలం రెండేళ్లలోనే అన్ని పనులూ పూర్తి చేశామని మేము చెప్పడం లేదు, కానీ ఒక మంచి శుభారంభం చేశాం. గత అవినీతి పాలనకు స్వస్తి పలికి, రాష్ట్రంలో మళ్లీ సుపరిపాలనను స్థాపించాం. 'మన మిత్ర' వాట్సప్ గవర్నెన్సు ద్వారా  ఆన్‌లైన్‌లో సేవలను నేరుగా ప్రజల చేతుల్లోకి తీసుకువచ్చాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం. తల్లికి వందనం, స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో వంటి పథకాల ద్వారా అండగా నిలుస్తున్నాం. పేదల జీవన ప్రమాణాలు పెంచి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. సంపన్న వర్గాలకు చెందిన 10 శాతం మంది, అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను ఆదుకునేలా 'పీ4' కార్యక్రమాన్ని రూపొందించాం. ఆర్థిక అసమానతలు తొలగించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు నా జీవితాన్ని అంకితం చేశాను. లక్ష మందికి పైగా మార్గదర్శులు, 10 లక్షల మందికి పైగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని అన్ని విధాలా సహకారం అందిస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 'వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్' కార్యక్రమాన్ని చేపట్టాం. పొదుపు ఉద్యమంలో మన డ్వాక్రా మహిళలు దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందుకే బ్యాంకులు సైతం మహిళలకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి" అని ఆయన అన్నారు.

రాష్ట్రంలోనే అగ్రగామిగా నెల్లూరు జిల్లా

"రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్నదే మా ఆకాంక్ష. విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలను కేంద్రాలుగా చేసుకుని మూడు రీజియన్లలో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో సంపద సృష్టిలో నెల్లూరు జిల్లా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులతో పాటు దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ అందుబాటులోకి రానున్నాయి. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ సంస్థ రూ. లక్ష కోట్లతో రిఫైనరీని ఏర్పాటు చేస్తోంది. ఇఫ్కో కిసాన్ సెజ్‌లో కూడా భారీగా పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పటికే గూడూరు ప్రాంతంలో 27 మెగా పరిశ్రమలు ప్రారంభం కాగా, త్వరలోనే మెగా ఫర్నిచర్ పార్కును కూడా ఏర్పాటు చేయబోతున్నాం. శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతం దేశానికే గర్వకారణం. గత పాలకుల విధానాల వల్ల రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో పారిశ్రామికవేత్తలు తిరిగి వస్తున్నారు. జాతీయ రహదారి కారిడార్లు, నాలుగు లైన్ల రైల్వే ట్రాక్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మన ప్రాంతం మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని పోర్టులకూ రైల్వే లైన్లను అనుసంధానించి, ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ లాజిస్టిక్స్ హబ్‌గా మారుస్తాం" అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

నీటి భద్రతపై నిరంతరం శ్రద్ధ

"సాగునీటి రంగానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. 36 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేలా ఒక క్యాలెండర్‌ను విడుదల చేశాం. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.24 వేల కోట్లు వెచ్చించాం. వెలిగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్లు అందిస్తాం. రూ.4 వేల కోట్ల పనులు పెండింగ్‌లో ఉండగానే గత పాలకుడు ఆ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయడం విడ్డూరం. నాటకాలు ఆడటం ఆయనకు అలవాటుగా మారింది. వెలిగొండ నిర్వాసితుల పునరావాసం కోసం రూ.900 కోట్లు కేటాయించాం, ఇప్పటికే రూ.300 కోట్లు చెల్లించాం. త్వరలోనే మిగతా మొత్తాన్ని కూడా చెల్లిస్తాం. రూ.2,500 కోట్లతో వెలిగొండ మొదటి దశను పూర్తి చేసి ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప తదితర జిల్లాలకు నీళ్లిస్తాం. ఎల్‌ నినో ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా ఉంది. వర్షాలు బాగా తగ్గాయి. గత ఏడాది పడిన వర్షాలకు గోదావరి, కృష్ణానదులు పొంగి పొర్లాయి. ఆ సమయంలోనే రిజర్వాయర్‌లను నింపాం. ఈ ఏడాది ఇప్పటికీ నదుల్లో ప్రవాహాలు రాలేదు. అయినా ప్రాజెక్టుల్లో 65 శాతం మేర నిల్వలు ఉన్నాయి. అందుకే భూమినే జలాశయంగా మార్చుకునేలా జల ధార లాంటి కార్యక్రమాలు చేపట్టాం. నదుల అనుసంధానం చేసేలా ప్రణాళికలు కూడా చేపట్టాలని ఆలోచన చేస్తున్నాం. గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేస్తే దిగువ రాష్ట్రాలకూ నీరు ఇచ్చే పరిస్థితి ఉంటుంది" అని ముఖ్యమంత్రి అన్నారు. 

తీవ్రవాదుల తరహాలో ప్రజల్ని భయపెడుతున్నారు

"పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. ఈ సమయంలోనే ఇథనాల్ వినియోగించుకుని ఇంధన పొదుపు చేయాల్సి ఉంది. ఇథనాల్ తయారీ కోసం మొక్కజొన్న లాంటి పంటలు అవసరం అవుతాయి. రైతులు ఈ ప్రత్యామ్నాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరిశ్రమల్ని ఆహ్వానించడానికి సమయం పడుతుంది. కానీ తరిమి కొట్టడానికి ఒక్క క్షణం చాలు. గత పాలకులు పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు. కర్ణాటకకు వెళ్లిపోవాల్సిన హీరో మోటార్స్ సంస్థను రాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడ మోటార్ సైకిళ్లు ఉత్పత్తి చేసేలా కృషి చేశాం. కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు కూడా 3వ తేదీన శంకుస్థాపన చేయబోతున్నాం. 2028 నాటికి ఆ రాయలసీమలో స్టీల్  పరిశ్రమ ఉత్పత్తి కూడా ప్రారంభిస్తుంది. నా ప్రయత్నం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందించటమే. గొడ్డలి పార్టీ తీవ్రవాదుల తరహాలో అందరినీ భయాందోళనలకు గురి చేస్తోంది.

రోజుకో ఫేక్ న్యూస్, రోజుకో విన్యాసంతో గొడ్డలి పార్టీ కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది. గొడ్డలి పార్టీ రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చింది. మేం అధికారంలోకి వచ్చాక ఈగల్ టాస్క్ ఫోర్సు ద్వారా నియంత్రించాం. గత పాలకులు ప్రజల్ని బంధించి, భయపెట్టి మరీ సమావేశాలు పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చాకే ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. రాష్ట్ర ప్రజలందరికీ అవసరమైన రాజధాని అమరావతి గొడ్డలి పార్టీకి అవసరం లేదు. అందుకే ఇంకా రాజధానిపై కుట్రలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వేగంగా పనులు జరుగుతుంటే సహించలేకపోతున్నారు. గత పాలకుడు తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలతో రాష్ట్రానికి రాజధానే లేకుండా పోయింది. మూడు రాజధానుల పేరిట గందరగోళ పరిచారు. ఎవరైనా పొరుగు రాష్ట్రాలకు వెళ్తే ఏపీకి మూడు రాజధానులా అని హేళనకు గురయ్యారు. పార్లమెంటులో శాశ్వత రాజధాని చట్టం చేస్తుంటే మావిగన్ అంటూ కొత్త ఆటలు మొదలు పెట్టారు. అమరావతి పరిరక్షణ కోసం అంటూ రౌడీలతో ఇప్పుడు దండయాత్ర చేస్తున్నారు. నిలకడలేని వ్యక్తులు రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు" అని మండిపడ్డారు.

హోంమంత్రిపై అవమానర వ్యాఖ్యలు


"విజయవాడలో యువకుడి అదృశ్యం ఘటన నా దృష్టికి వస్తూనే సీఐను సస్పెండ్ చేశాం, చర్యలకు ఆదేశించాం. కానీ వైసీపీ నాయకులు కులాల మధ్య వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులతో విష ప్రచారం చేస్తున్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లతో ఆ పార్టీ నేతలు రెచ్చి పోతున్నారు. హోం మంత్రి అనిత మేకప్ పై ఆ పార్టీ నేతలు అసహ్యంగా, అవమానకరంగా మాట్లాడారు. మహిళా కమిషన్ ఈ అంశంపై గట్టిగా ప్రశ్నించినా ఆ పార్టీ నేతలు తమ వ్యాఖ్యల్ని సమర్థించుకుంటున్నారు. జగన్ సహకారం లేకపోతే ఆయన వెంట ఉన్న నేతలు విచ్చలవిడిగా మాట్లాడే పరిస్థితి ఉండదు. మా పార్టీలో ఈ తరహా మాట్లాడిన వారిని పార్టీ నుంచి బయటకు పంపించాం.

మేం యజ్ఞంలా అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లా దానికి ఆటంకం కలిగిస్తున్నారు. నేరాలు చేసే పార్టీ, నేరస్తులను కాపాడే పార్టీ, నేరస్తులతో రాజకీయాలు చేసే పార్టీని ఇప్పుడే చూస్తున్నాం. అర్హత లేని వారిని అందలం ఎక్కిస్తే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సమస్యలు వస్తాయి. ఇలాంటి వ్యక్తులను జైల్లో పెట్టాలంటే ఒక్క నిముషం పని కానీ మేం ప్రతీ కార రాజకీయాలు చేయటం లేదు. మా దృష్టి అంతా రాష్ట్రం అభివృద్ధి కావాలని, తెలుగు వారిని అందలం ఎక్కించాలనే. రాష్ట్రంలో రౌడీయిజం చేయాలన్నదే వైసీపీ నేతల ఆలోచన. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అనే సంకల్పం ప్రజలు చేయాలని కోరుతున్నాను. 'ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్' అన్నదే మన నినాదం కావాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుంది. నేరస్తులకు వంతపాడటం, నేరాలు చేయటం రాజకీయ పార్టీలకు తగదు. ఇలాంటి పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను" అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

డ్వాక్రా మహిళలకు అభినందన

అనంతరం ప్రజా వేదిక సమీపంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. సెర్ప్ ఆధ్వర్యంలో స్వయం సహాయ సంఘాల మహిళలు ప్రదర్శించిన అధునాతన కుట్టు మిషన్లను ముఖ్యమంత్రి తిలకించారు. ఆధునిక కుట్టు మిషన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్ర పటాన్ని అప్పటికప్పుడే తయారు చేసిన మహిళలు దానిని ఆయనకు అందించారు. అరటి నారతో తయారు చేసిన వివిధ ఉత్పత్తులను చూసిన ముఖ్యమంత్రి డ్వాక్రా సంఘాల మహిళలను అభినందించారు. ప్రకృతి సేద్యం ద్వారా పండిస్తున్న ఉద్యాన పంటల ఉత్పత్తులు, మత్స్యకార బోట్లకు బిగించే ట్రాన్స్ పాండర్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.
Chandrababu Naidu
Andhra Pradesh Development
Nellore District News
Social Security Pensions AP

More Telugu News