జగన్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి: ధూళిపాళ్ల నరేంద్ర
- గత ఐదేళ్ల వైసీపీ పాలన రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదమని ఆరోపణ
- ప్రతిపక్షాలను అణచివేసిన జగన్‌కు శాంతిభద్రతలపై మాట్లాడే హక్కులేదన్న నరేంద్ర
- అమరావతికే ప్రజలు పట్టం కట్టారని.. జగన్ కుట్రలు సాగవని హెచ్చరిక
- కూటమి పాలనలో చట్టం తనపని తాను చేసుకుపోతోందని స్పష్టీకరణ
జగన్ పాలనలో జరిగిన అమానుష ఘటనలను ధూళిపాళ్ల ఈ సందర్భంగా ప్రస్తావించారు. "వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దళిత డ్రైవర్‌ను హత్య చేసి మృతదేహాన్ని నేరుగా ఇంటికి పంపితే, జగన్ ఆయనను పక్కన పెట్టుకుని తిరిగారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను పిచ్చోడిని చేసి చిత్రహింసలకు గురిచేసి మృతికి కారకులయ్యారు. తన సోదరిని వేధిస్తున్నారని ప్రశ్నించిన విద్యార్థి అమర్నాథ్ గౌడ్‌పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఇటువంటి నేర చరిత్ర కలిగిన జగన్ నేడు నీతులు చెప్పడం హాస్యాస్పదం" అని మండిపడ్డారు.
"నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నివాసంపైకి రౌడీలను పంపి, ఆయన పర్యటనలను అడ్డుకుంటూ భయోత్పాతం సృష్టించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు తెగబడ్డారు. కానీ, నేడు ఘోరంగా ఓడిపోయినప్పటికీ జగన్ స్వేచ్ఛగా హెలికాప్టర్లలో తిరుగుతున్నారంటే, అది కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనం" అని ధూళిపాళ్ల పేర్కొన్నారు. రాజధాని అమరావతి విషయంలో జగన్ ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చారని, 164 సీట్లతో ప్రజలు కూటమికి పట్టం కట్టినా ఆయన తీరులో మార్పు రాలేదని విమర్శించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ ఫియర్’ లేదని, కేవలం 'రూల్ ఆఫ్ లా' మాత్రమే నడుస్తోందని ధూళిపాళ్ల స్పష్టం చేశారు. విజయవాడ సాయికృష్ణ కేసులో ప్రభుత్వం తక్షణమే స్పందించి సిట్ ఏర్పాటు చేసిందని, లిక్కర్ స్కామ్‌పై విచారణ ముమ్మరం కావడంతోనే వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని అన్నారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడొచ్చని, అయితే విధ్వంసం సృష్టించాలని చూస్తే మాత్రం ఉక్కుపాదంతో అణచివేస్తామని ఆయన హెచ్చరించారు.