హజ్ యాత్రికులకు రూ.లక్ష సాయం.. మాట నిలబెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం
- విజయవాడ నుంచి వెళ్లిన హజ్ యాత్రికులకు లక్ష రూపాయల సబ్సిడీ
- 331 మంది యాత్రికుల ఖాతాల్లోకి నేరుగా రూ. 3.31 కోట్లు జమ
- అదనపు విమాన చార్జీల భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం
- ముఖ్యమంత్రి చంద్రబాబుకు మైనార్టీ వ్యవహారాల సలహాదారు కృతజ్ఞతలు
- తప్పుడు ప్రచారంపై వైసీపీ మీడియాను హెచ్చరించిన ప్రభుత్వ సలహాదారు
ఈ ఏడాది రాష్ట్రం నుంచి మొత్తం 1,987 మంది హజ్ యాత్రకు వెళ్లగా, వారిలో 331 మంది విజయవాడ నుంచి ప్రయాణించారు. బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలతో పోలిస్తే విజయవాడ నుంచి ప్రయాణించిన వారికి దాదాపు రూ. 80,000 అదనపు భారం పడింది. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా, 331 మంది యాత్రికుల కోసం మొత్తం రూ. 3.31 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రభుత్వ నిర్ణయంపై మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎండీ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది (2025) కూడా విజయవాడ యాత్రికులకు ఇదే విధంగా ప్రభుత్వం అండగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం హామీలను నిలబెట్టుకుంటుందనడానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఇదే సమయంలో, వైసీపీ అనుకూల మీడియా వైఖరిపై షరీఫ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సబ్సిడీ చెల్లింపులో చోటుచేసుకున్న 15 రోజుల స్వల్ప జాప్యాన్ని ఆసరాగా చేసుకుని, సాక్షి పత్రిక, బ్లూ సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేశాయని ఆరోపించారు. ఇది అత్యంత దిగజారుడు రాజకీయమని, ఇటువంటి అసత్య ప్రచారాలను మానుకోకపోతే ప్రజలు మరోసారి తగిన బుద్ధి చెబుతారని 'తస్మాత్ జాగ్రత్త' అంటూ ఆయన హెచ్చరించారు.