సైన్స్‌కే సవాల్ విసిరే ఆక్టోపస్.. ఇవి తెలుసుకుంటే షాక్ అవుతారు
- ఆక్టోపస్‌కు మూడు గుండెలు ఉంటాయి
- దీని రక్తం నీలి రంగులో ఉంటుంది
- క్షణాల్లో రంగు, చర్మ ఆకృతిని మార్చగలదు
- అద్భుతమైన జ్ఞాపకశక్తి, సమస్యలు పరిష్కరించే సామర్థ్యం
- ఎముకలు లేకపోవడంతో చిన్న రంధ్రాల్లోనూ దూరిపోతుంది
మూడు గుండెలు
ఆక్టోపస్‌కు మొత్తం మూడు గుండెలు ఉంటాయి. వాటిలో రెండు గుండెలు ‘బంప్స్’కు రక్తాన్ని పంపిస్తాయి. మూడో గుండె శరీరమంతా రక్తాన్ని ప్రసరిస్తుంది. ఈదే సమయంలో ప్రధాన గుండె కొంతసేపు పనిచేయదు. అందుకే ఆక్టోపస్‌లు ఎక్కువగా సముద్ర అడుగున పాకుతూ కదలడానికే ఇష్టపడతాయి.
నీలి రంగు రక్తం
మనుషుల్లా ఎర్ర రక్తం కాకుండా ఆక్టోపస్ రక్తం నీలి రంగులో ఉంటుంది. దీనికి కారణం హిమోగ్లోబిన్ బదులు రాగి ఆధారిత హీమోసయానిన్ అనే పదార్థం ఉండటమే. ఇది చల్లటి సముద్ర జలాల్లో ఆక్సిజన్‌ను సమర్థంగా మోసుకెళ్లేందుకు సహాయపడుతుంది.
క్షణాల్లో రంగు మార్చే శక్తి
ఆక్టోపస్ తన చర్మం రంగును మాత్రమే కాదు.. చర్మ ఉపరితల ఆకృతినీ మార్చగలదు. రాళ్లు, పగడాలు, ఇసుక మధ్య తనను తాను పూర్తిగా కలిపేసుకుని శత్రువుల కంట పడకుండా దాక్కుంటుంది. అందుకే దీనిని సముద్రంలోని గొప్ప మాయగాడిగా పిలుస్తారు.
ఆశ్చర్యపరిచే తెలివితేటలు
ఆక్టోపస్‌లు పజిల్స్ పరిష్కరించడం, మూతలు తెరవడం, గతంలో నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకోవడం వంటి పనులు చేయగలవని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్నిసార్లు కొబ్బరి చిప్పలను తీసుకెళ్లి అవసరమైనప్పుడు వాటిని ఆశ్రయంగా ఉపయోగించుకోవడం కూడా గమనించారు. ఇది ముందస్తు ప్రణాళికతో వ్యవహరించే అరుదైన జంతువుల్లో ఒకటి.
చిన్న రంధ్రంలోనూ దూరిపోతుంది
ఆక్టోపస్ శరీరంలో ఎముకలు ఉండవు. దాని ముక్కు మాత్రమే గట్టి భాగం. ఆ ముక్కు దూరేంత చిన్న రంధ్రం ఉంటే, మొత్తం శరీరాన్ని కూడా అందులోకి దూర్చగలదు. ఈ లక్షణం వల్ల ప్రమాదాల నుంచి సులభంగా తప్పించుకుంటుంది.