షైనింగ్ స్టార్స్ వేదికపై విద్యార్థుల కలలు.. ఆసక్తిగా ఆలకించి, సూచనలు స్వీకరించిన మంత్రి లోకేశ్

Nara Lokesh listens to student dreams and suggestions at Shining Stars event
  • తాడేపల్లిలో జరిగిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో టాపర్లకు సత్కారం
  • విద్యార్థుల అభిప్రాయాల కోసం డ్రీమ్, గ్రాటిట్యూడ్, సజెషన్ వాల్స్ ఏర్పాటు
  • డాక్టర్, సీఏ, ఐఏఎస్ అవుతామంటూ విద్యార్థులు తమ లక్ష్యాలను పంచుకున్నారు
  • వంద రోజుల ప్రణాళికపై ప్రభుత్వానికి, మంత్రి లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు
  • విద్యార్థుల సూచనలను స్వీకరించి, వాటిని క్రోడీకరించాలని అధికారులను ఆదేశించిన లోకేశ్
తాము భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నామో కొందరు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. మరికొందరు తమకు అండగా నిలుస్తున్న వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంకొందరు తమ విద్యావ్యవస్థలో రావాల్సిన మార్పులపై స్పష్టమైన సూచనలు చేశారు. వీటన్నింటికీ వేదికైంది ‘షైనింగ్ స్టార్స్’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం. పది, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక, విద్యార్థుల చురుకైన భాగస్వామ్యంతో ఎంతో ఉత్తేజభరితంగా సాగింది.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాల్ బోర్డులు. కార్యక్రమానికి హాజరైన మంత్రి నారా లోకేశ్, వేదిక వద్దకు వెళ్లడానికి ముందు ఈ వాల్ బోర్డులను ఆసక్తిగా పరిశీలించారు. ‘డ్రీమ్ వాల్’, ‘గ్రాటిట్యూడ్ వాల్’, ‘సజెషన్ వాల్’ పేరిట ఏర్పాటు చేసిన ఈ గోడలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకున్నారు. ప్రతి విద్యార్థి అభిప్రాయాన్ని లోకేశ్ ఓపికగా చదివి, వారి ఆలోచనా విధానాన్ని తెలుసుకున్నారు.

ఉన్నత లక్ష్యాలతో స్ఫూర్తి నింపిన విద్యార్థులు

‘డ్రీమ్ వాల్’పై విద్యార్థులు తమ భవిష్యత్ ఆశయాలను ఆవిష్కరించారు. మన్యం జిల్లా ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఎన్. మౌనిక, తాను డాక్టర్ కావాలనుకుంటున్నట్లు తెలిపారు. "వైద్యురాలినై సమాజానికి సేవ చేస్తాను. పేద ప్రజల కోసం ఆసుపత్రులు నిర్మించి, మన దేశం ఆరోగ్యంగా, సంపన్నంగా ఉండేందుకు కృషి చేస్తాను" అని తన మహోన్నత లక్ష్యాన్ని వివరించారు. 

కాకినాడ జిల్లా సంపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని డి. చిన్నారి, తాను చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)గా దేశానికి సేవ చేస్తానని పేర్కొన్నారు. "పేద ప్రజలు ఆర్థికంగా ఎదిగేలా వారికి అవగాహన కల్పిస్తాను. ఆర్థిక నేరాలను కట్టడి చేయడమే నా జీవిత లక్ష్యం" అని తన మనోగతాన్ని పంచుకున్నారు. 

ఇదే విధంగా, కాకినాడ జిల్లాకు చెందిన ఎస్. శివరామకృష్ణ, తాను ఐఏఎస్ అధికారిగా, ఆ తర్వాత పాఠశాల విద్య కమిషనర్‌గా పనిచేసి విద్యా రంగంలో కీలక సంస్కరణలు తీసుకువస్తానని తన కలను డ్రీమ్ వాల్ ద్వారా పంచుకున్నారు.

ప్రభుత్వానికి, మంత్రికి కృతజ్ఞతలు

మరోవైపు ‘గ్రాటిట్యూడ్ వాల్’ విద్యార్థుల కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్, అలాగే తమ ప్రతిభను గుర్తించి నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు కేజీబీవీ విద్యార్థిని కె. జయశ్రీ, శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని ఎస్. దేవీప్రియ ఈ గోడపై ప్రభుత్వానికి, మంత్రి లోకేశ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

విద్యావ్యవస్థపై స్పష్టమైన సూచనలు

‘సజెషన్ వాల్’ ద్వారా విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టారు. బాలికలకు ఆత్మరక్షణ (సెల్ఫ్ డిఫెన్స్)పై అవగాహన కల్పించాలని, పాఠశాల స్థాయిలో ఐఐటీ సిలబస్‌ను జోడించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ బేసిక్స్ నేర్పించాలని కోనసీమ జిల్లాకు చెందిన జీహెచ్ఎస్ దుర్గ సూచించారు. 

చదువుతో పాటు శారీరక దారుఢ్యం కూడా ముఖ్యమని, అందుకోసం అన్ని పాఠశాలల్లో క్రీడా మైదానాలను అందుబాటులోకి తీసుకురావాలని అనకాపల్లి జిల్లా కేజీబీవీ విద్యార్థిని కె. పూర్ణ సౌత్రిక కోరారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి, ఇంటర్నెట్‌ను సరైన మార్గంలో వినియోగించేలా అవగాహన కల్పించాలని మార్కాపురం జిల్లా కేజీబీవీ విద్యార్థిని కె. రాజేశ్వరి సూచించారు. 

విద్యార్థులు వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలు, సూచనలను చూసి మంత్రి లోకేశ్ ఎంతో ముగ్ధుడయ్యారు. వాటన్నింటినీ క్రోడీకరించి ఒక నివేదిక సిద్ధం చేయాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు.
Nara Lokesh
Shining Stars Awards
Andhra Pradesh Education Department
Mangalagiri Tadepalli News
Student Career Goals
Education System Reforms

More Telugu News