రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకూ సాధ్యంకాని అరుదైన ఘనత.. నేడు హర్మన్‌ప్రీత్ ఖాతాలోకి!
- టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు సౌతాఫ్రికాతో తలపడనున్న భారత్
- హర్మన్‌ప్రీత్‌కు ఇది 200వ అంతర్జాతీయ టీ20
- క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ప్లేయర్
- ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఆడింది 159 మ్యాచ్‌లే
- 2009లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం
- 2025లో భారత్‌కు వన్డే ప్రపంచకప్ అందించి రికార్డ్
పంజాబ్‌కు చెందిన ఈ పవర్‌హౌస్ ఆల్‌రౌండర్ సుదీర్ఘ ప్రయాణం 2009లో ఇంగ్లండ్‌లో జరిగిన తొలి మహిళా టీ20 ప్రపంచకప్‌తో ప్రారంభమైంది. గత 17 ఏళ్లుగా అద్భుతమైన శారీరక దృఢత్వం, ఆటపై అంకితభావంతో భారత జట్టులో కీలక సభ్యురాలిగా, విజయవంతమైన కెప్టెన్‌గా ఆమె కొనసాగుతోంది. హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోనే భారత జట్టు గతేడాది మహిళల వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
హర్మన్ ప్రీత్ అరుదైన ఘనతపై భారత బౌలింగ్ కోచ్ ఆవిష్కార్ సాల్వి స్పందిస్తూ.. హర్మన్ ప్రపంచ క్రికెట్‌కే ఒక గొప్ప రోల్ మోడల్ అని కొనియాడింది. డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో ఆమెతో కలిసి ఆడుతున్న సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్లో టైరాన్ కూడా హర్మన్ నాయకత్వ పటిమను, సుదీర్ఘ కెరీర్‌ను అభినందించింది.
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు టోర్నమెంట్‌లో అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లపై ఘన విజయాలు సాధించి లీగ్ పట్టికలో భారత్ బలంగా ఉండగా.. ఆస్ట్రేలియాతో ఓడి, పాక్‌పై గెలిచిన సౌతాఫ్రికాకు సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు అనివార్యం.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో సౌతాఫ్రికా 4-1తో భారత్‌ను ఓడించిన నేపథ్యం ఉండటంతో మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. ఇందులో భారత్ గెలిస్తే సెమీఫైనల్ అవకాశాలు దాదాపు ఖాయమవుతాయి. పురుషుల క్రికెట్ కంటే ముందే మహిళా క్రికెట్‌లో ఒక ప్లేయర్ 200 మ్యాచ్‌ల మార్కును అందుకోవడం అనేది, ఇటీవలి కాలంలో మహిళా క్రికెట్ షెడ్యూల్ ఎంతగా విస్తరణ, దానికి అంతర్జాతీయంగా దక్కుతున్న ఆదరణకు నిదర్శనం. 2009లో ఒక సాధారణ డెబ్యూటెంట్‌గా అడుగుపెట్టి, నేడు గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన హర్మన్‌ప్రీత్ సాధించిన ఈ ఘనత యావత్ భారత క్రీడాలోకానికి గర్వకారణంగా నిలుస్తోంది.