శ్రీలంకలో ఘటనతో గుణపాఠం.. వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక శిక్షణ?

Lesson from Sri Lanka incident Special training for Vaibhav Suryavanshi
  • వైభవ్‌కు స్లెడ్జింగ్ ఎదుర్కోవడంలో ప్రత్యేక శిక్షణ అవసరమంటున్న క్రీడా నిపుణులు 
  • శ్రీలంక 'ఏ' జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్లెడ్జింగ్‌కు దూకుడుగా స్పందించి వార్త‌ల్లో నిలిచిన వైనం
  • ప్రతిభతో పాటు మానసిక దృఢత్వం కూడా కీలకమని నిపుణుల విశ్లేషణ
  • యువ ఆటగాళ్ల కోసం ఎన్‌సీఏలో ఇప్పటికే మానసిక శిక్షణా కార్యక్రమాలు
భారత యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎంతగా వార్తల్లో నిలుస్తున్నాడో, ఇప్పుడు అతని మానసిక దృఢత్వం గురించి కూడా అంతే చర్చ జరుగుతోంది. ఇటీవల శ్రీలంక 'ఏ' జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థుల స్లెడ్జింగ్‌కు దూకుడుగా స్పందించిన ఘటనతో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అతనికి 'సిట్యుయేషన్ మేనేజ్‌మెంట్'లో ప్రత్యేక శిక్షణ అవసరమని క్రీడా నిపుణులు, మానసికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

క్రికెట్‌లో వైభవ్ స్థాయి పెరిగేకొద్దీ, ప్రత్యర్థి జట్లు అతని ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ఒత్తిడికి గురిచేయడానికి స్లెడ్జింగ్ వంటి మానసిక ఎత్తుగడలను ప్రయోగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను తట్టుకుని నిలబడాలంటే కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదని, అపారమైన మానసిక స్థైర్యం కూడా అవసరమని స్పష్టం చేస్తున్నారు.

ఎన్‌సీఏలో ఇప్పటికే శిక్షణ..
ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ డాక్టర్ స్వరూప్ సవనూర్ పీటీఐతో మాట్లాడుతూ.. "నేను రెండు, మూడేళ్ల క్రితం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో అండర్-16 కుర్రాళ్లకు శిక్షణ ఇచ్చినప్పుడు వైభవ్‌తో పనిచేశాను. అతను చాలా ప్రశాంతమైన కుర్రాడు. వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ఎన్‌సీఏ, బీసీసీఐలకు యువ ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి తెలుసు. అందుకే క్యాంపులు నిర్వహించినప్పుడు క్రీడాకారులకు స్పోర్ట్స్ సైకాలజీ సేవలు అందిస్తున్నారు" అని తెలిపారు. గతంలో రాహుల్ ద్రవిడ్ ఎన్‌సీఏ హెడ్‌గా ఉన్నప్పుడు కూడా తాను యువ క్రికెటర్ల కోసం 18-19 హై-పెర్ఫార్మెన్స్ క్యాంపులు నిర్వహించానని ఆయన గుర్తుచేశారు.

ప్రతిభ ఒక్కటే సరిపోదు..
అండర్-19 స్థాయిలో అద్భుతంగా రాణించిన ఎందరో ఆటగాళ్లు, సీనియర్ స్థాయికి వచ్చేసరికి అదే విజయాన్ని అందుకోలేకపోతున్నారని డాక్టర్ సవనూర్ ఆవేదన వ్యక్తం చేశారు. "వారిలో ప్రతిభ, టెక్నిక్, పట్టుదల అన్నీ ఉంటాయి. కానీ, ఒత్తిడిని తట్టుకునే 'సిట్యుయేషనల్ ఇంటెలిజెన్స్' (పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే తెలివి) అభివృద్ధి చెందకపోతే, ప్రతిభకు సరైన గుర్తింపు రాదు. వైభవ్‌లో ఇది ఉందా? లేదా? అన్నది ప్రశ్న కాదు, అతని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని, దానిపై పనిచేయడం ముఖ్యం" అని ఆయన వివరించారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, జడేజా వంటి దిగ్గజాలు వివిధ ఫార్మాట్ల నుంచి తప్పుకోవడంతో భారత జట్టు ప్రస్తుతం పరివర్తన దశలో ఉంది. ఈ సమయంలో జట్టులోకి వస్తున్న యువ ఆటగాళ్లు భారీ అంచనాల మధ్య ఆడుతున్నారు. ఓ మాజీ సీనియర్ సెలక్టర్ మాట్లాడుతూ.. "యువ క్రికెటర్లలో ప్రతిభకు కొదవలేదు. కానీ దిగ్గజాల స్థానంలోకి వస్తున్నామనే ఆత్రుతలో కొన్నిసార్లు రికార్డుల కోసం తొందరపడతారు. ఇది ఆందోళనకు దారితీస్తుంది. బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్ కొత్త ఆటగాళ్లతో మాట్లాడి, 'మీ వెనుక మేమున్నాం, తొందరపడకండి' అని భరోసా ఇవ్వాలి. ఇది వారిపై ఒత్తిడిని తగ్గించి, పెద్ద వేదికలపై రాణించడానికి సహాయపడుతుంది" అని సూచించారు. క్రీడా ప్రపంచం మానసిక సవాళ్లను ఒక సమస్యగా కాకుండా ఆటలో భాగంగా చూసి, ఆటగాళ్లకు అండగా నిలవాలని నిపుణులు చెబుతున్నారు.
Go Back to Shorts
Vaibhav Suryavanshi
Indian Cricket
National Cricket Academy
Sports Psychology
Under 19 Cricket
BCCI

More Telugu News