కేంద్రం కీలక నిర్ణయం.. ఇథనాల్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు!

Central Government waives excise duty for petrol with 22 to 30 percent ethanol
  • స్వచ్ఛ ఇంధనాలకు ప్రోత్సాహం
  • ఈ22 నుంచి ఈ30 వరకు వర్తింపు
  • అధిక ఇథనాల్‌ ఇంధనాల వినియోగానికి ఊతం
  • ఇటీవలే పెట్రోల్‌ మిశ్రమాలకు వెలువడిన కొత్త ప్రమాణాలు
పెట్రోల్‌లో అధిక శాతం ఇథనాల్‌ కలిపిన ఇంధనాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం మినహాయించింది. 22 శాతం నుంచి 30 శాతం వరకు ఇథనాల్‌ ఉన్న పెట్రోల్‌పై ఈ మినహాయింపు వర్తించనుంది. ఈ22, ఈ25, ఈ27, ఈ30 ఇంధన రకాలపై కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఈ నిర్ణయంతో దేశంలో అధిక శాతం ఇథనాల్‌ ఉన్న ఇంధనాల వినియోగానికి ఊతం లభించే అవకాశం ఉంది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, దేశీయంగా ఉత్పత్తి అయ్యే స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ22, ఈ25, ఈ27, ఈ30 పెట్రోల్‌ మిశ్రమాలకు కొత్త నాణ్యత ప్రమాణాలను బీఐఎస్‌ ప్రకటించింది. ఇథనాల్‌ శాతం, ఆక్టేన్‌ రేటింగ్‌, సల్ఫర్‌ పరిమితులు, భద్రతా నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు పన్ను మినహాయింపు కూడా రావడంతో అధిక ఇథనాల్‌ మిశ్రమాలకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక మద్దతు లభించినట్లైంది.

దేశంలో ఇథనాల్‌ మిశ్రమాల కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోంది. 2018లో తీసుకొచ్చిన జాతీయ బయోఫ్యూయల్‌ విధానాన్ని 2022లో సవరించిన కేంద్రం 20 శాతం ఇథనాల్‌ మిశ్రమ లక్ష్యాన్ని 2030 నుంచి 2025-26కు ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ సంస్థలు 2022 జూన్‌లోనే 10 శాతం మిశ్రమ లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఆ తర్వాత ఇథనాల్‌ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇథనాల్‌ మిశ్రమాలపై గతంలో కొందరు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మైలేజ్‌, ఇంజిన్‌ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ20 ఇంధనం వల్ల భద్రతాపరమైన సమస్యలు లేవని వాహన తయారీ సంస్థల సంఘం స్పష్టం చేసింది. పూర్తి అధ్యయనం తర్వాతే నిర్ణయాలు తీసుకున్నామని కేంద్రం కూడా తెలిపింది.
Go Back to Shorts
Central Government
Ethanol Blended Petrol
Excise Duty Exemption
National Biofuel Policy
Clean Energy India
Fuel Price Relief

More Telugu News