ఆహార పదార్థాలకు న్యూస్‌పేపర్ వాడొద్దు.. FSSAI కీలక ఆదేశాలు
- పేపర్ ప్రింటింగ్ ఇంక్‌లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని హెచ్చరిక
- వేడి, నూనె పదార్థాల వల్ల ఇంక్‌లోని సీసం ఆహారంలో కలిసే ప్రమాదం
- ఈ నిబంధన ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ
వార్తాపత్రికల ముద్రణలో ఉపయోగించే సిరాలో సీసం (lead) వంటి ప్రమాదకరమైన భారీ లోహాలు, ఇతర రసాయనాలు ఉంటాయని FSSAI వివరించింది. వేడిగా, నూనెతో ఉండే సమోసా, పకోడీ, వడ వంటి పదార్థాలను పేపర్లలో చుట్టినప్పుడు, ఆ రసాయనాలు సులభంగా ఆహార పదార్థాల్లోకి చేరుతాయి. ఇటువంటి కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు సంభవించడంతో పాటు మూత్రపిండాలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ హెచ్చరించింది.
ఇటీవల ముంబైలోని ఓ ప్రముఖ వడపావ్ విక్రయదారుడు వార్తాపత్రికలను వినియోగిస్తున్నట్లు FSSAI, బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) జరిపిన సంయుక్త తనిఖీల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో 2016, 2023 సంవత్సరాల్లోనూ FSSAI ఇటువంటి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆహార పదార్థాల నుంచి అదనపు నూనెను తొలగించేందుకు కూడా వార్తాపత్రికలను ఉపయోగించరాదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్యాకేజింగ్) రెగ్యులేషన్స్-2018 ప్రకారం, ఆహార పదార్థాల నిల్వ లేదా సరఫరాకు కేవలం ‘ఫుడ్-గ్రేడ్’ మెటీరియల్స్ మాత్రమే వాడాలని FSSAI సూచించింది. ఈ నిబంధనల అమలును క్షేత్రస్థాయిలో కఠినంగా పర్యవేక్షించాలని అన్ని రాష్ట్రాల ఆహార భద్రతా అధికారులను ఆదేశించింది.