జడేజా రీఎంట్రీ.. కొత్త ఆల్‌రౌండర్‌కు అవకాశం.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఖరారు

Ravindra Jadeja back in Indian Test team for Sri Lanka tour
  • శ్రీలంక టెస్టులకు భారత జట్టు ప్రకటన
  • గాయం నుంచి కోలుకుని జడేజా రీఎంట్రీ
  • సారాంశ్ జైన్‌కు తొలి పిలుపు
  • వాషింగ్టన్ సుందర్ తొలి టెస్టుకు దూరం
  • ఆగస్టు 7 నుంచి ప్రాక్టీస్ మ్యాచ్
  • ఫిట్‌నెస్‌ పరీక్షల్లో పాస్‌ అయితేనే బుమ్రా, సాయి సుదర్శన్‌కు స్థానం
శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి తిరిగి వచ్చాడు. ఐపీఎల్-2026 సమయంలో టెన్నిస్ ఎల్బో గాయంతో జట్టుకు దూరమైన అతడు, పూర్తిగా కోలుకున్నాడు. ఇంగ్లండ్ వన్డే సిరీస్‌లో తొడ కండరాల గాయంతో వాషింగ్టన్ సుందర్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. అతడి స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌కు తొలిసారి భారత జట్టులో అవకాశం లభించింది.

ఇటీవల శ్రీలంక-ఏతో జరిగిన మ్యాచుల్లో ఆకట్టుకున్న సారాంశ్ జైన్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 42 మ్యాచ్‌లు ఆడిన అతడు 131 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌తో కూడా 1,455 పరుగులు చేసి ఆల్‌రౌండర్‌గా తన సత్తా చాటాడు. దీంతో వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా అతణ్ని ఎంపిక చేశారు.

శ్రీలంక పర్యటనకు ముందు భారత జట్టు ఆగస్టు 7 నుంచి కొలంబోలో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలేలో, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో జరుగుతుంది. మరోవైపు సాయి సుదర్శన్, జస్ప్రీత్ బుమ్రా తుది ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ వెల్లడించింది.

భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మనవ్ సుథార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్
Advertisement
Ravindra Jadeja
Saransh Jain
India vs Sri Lanka Test Series
BCCI
Shubman Gill
Indian Cricket Team

More Telugu News