నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం హామీ: సీజేపీ

Cockroach Janata Party warning forces Center to promise withdrawal of cases against protesters
  • తాజా నిరసనల హెచ్చరికను విరమించుకున్న సీజేపీ
  • ఆందోళనకారులతో ప్రభుత్వ ప్రతినిధుల సుదీర్ఘ భేటీ
  • నిరసనకారులపై కేసులు ఎత్తివేస్తున్నట్టు బీహార్, అసోం ప్రకటనలు
  • అన్ని బీజేపీ/ఎన్డీయే రాష్ట్రాల నుంచి హామీ ఇస్తామన్న కేంద్రం
  • ఏ ఒక్క నిరసనకారుడిని ఒంటరిని చేయమని సీజేపీ స్పష్టీకరణ
తాజాగా మరోసారి నిరసనలకు దిగుతామని 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) హెచ్చరించిన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఆందోళనకారులకు రక్షణ కల్పించే విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేసింది. నిరసనకారులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టు బీహార్, అసోం రాష్ట్రాలు జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లను సీజేపీ నేతలకు అందజేసింది. దీంతో సీజేపీ తన తాజా నిరసన కార్యాచరణను ప్రస్తుతానికి విరమించుకుంది.

ఇవాళ‌ తెల్లవారుజామున 1 గంటకు సీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ 'ఎక్స్' వేదికగా కీలక విషయాలు వెల్లడించారు. తాము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన కొన్ని గంటలకే ప్రభుత్వ ప్రతినిధులు తమతో సమావేశమయ్యారని, ఈ భేటీ సుమారు 2-3 గంటల పాటు సాగిందని తెలిపారు. ఈ సమావేశంలో నిరసనకారులపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవడం, అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయడం, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించడం వంటి అంశాలపై బీహార్, అసోం ప్రభుత్వాలు జారీ చేసిన నోటిఫికేషన్ల కాపీలను ప్రభుత్వ ప్రతినిధులు తమకు చూపించారని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం, ఇతర బీజేపీ/ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి హామీ నోటిఫికేషన్లు జారీ చేయిస్తామని ప్రభుత్వం పునరుద్ఘాటించిందని సౌరవ్ దాస్ పేర్కొన్నారు. "అంగీకరించిన భాషలోనే నోటిఫికేషన్లు వస్తాయని ఆశిస్తున్నాం. ఏ నిరసనకారుడినీ ఒంటరిగా వదిలిపెట్టం. మనమందరం కలిసికట్టుగా ఉన్నాం" అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం అనంతరం విడుదల చేసిన వీడియో సందేశంలో, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావేమోనన్న తమ ఆందోళనలను వారి ముందు ఉంచినట్లు దాస్ తెలిపారు. దీనికి స్పందనగా ప్రభుత్వ ప్రతినిధులు బీహార్ హోం శాఖ పత్రికా ప్రకటనను తమ వెంట తీసుకొచ్చారని, ఆందోళనకారులపై పెట్టిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎలాంటి చర్యలు ఉండవని అందులో స్పష్టంగా ఉందని వివరించారు.

తాజా నిరసనల హెచ్చరికతో కదలిక
అంతకుముందు నిన్న‌ సీజేపీ ప్రతినిధి అశుతోశ్‌ రంకా సంచలన ఆరోపణలు చేశారు. నిరసనకారులపై ఎలాంటి పోలీసు చర్యలు ఉండవని చర్చల సమయంలో ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తోందని అన్నారు. బీహార్, బెంగాల్‌లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారని, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో మళ్లీ నిరసనలు ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ప్రభుత్వం వెంటనే స్పందించి సీజేపీ నేతలతో చర్చలు జరిపింది.

'నీట్-యూజీ' పరీక్షలో అవకతవకలపై అభిజీత్ డిప్కే నేతృత్వంలోని సీజేపీ 37 రోజుల పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ ప్రధాన డిమాండ్‌ నెరవేరడంతో వారాంతంలో ఈ నిరసనను విరమించారు. కాగా, బీహార్, అసోం నోటిఫికేషన్ల తర్వాత రాజస్థాన్‌లోని నిరసనకారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని సౌరవ్ దాస్ తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న అన్ని బీజేపీ/ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి నిరసనకారుల ప్రయోజనాలను కాపాడేలా స్పష్టమైన నోటిఫికేషన్లు వచ్చే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
Cockroach Janata Party
Sourav Das
NEET UG protests
Central Government
FIR withdrawal
Bihar Assam student cases

More Telugu News