కదులుతున్న రైలు ఏసీ కోచ్‌లో దీపం వెలిగించి ప్రయాణికుడి పూజలు.. వైరల్ వీడియోతో వెలుగులోకి ఘటన!

Passenger performs puja by lighting lamp in moving train AC coach incident revealed by viral video
  • దీపం, అగరుబత్తీలు వెలిగించడంతో ప్రయాణికుల్లో ఆందోళన
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
  • ఘటనపై స్పందించిన రైల్వే శాఖ.. విచారణకు ఆదేశం
  • వ్యక్తిగత విశ్వాసాల కోసం ప్రజా భద్రతను పణంగా పెట్టొద్దని హితవు
కదులుతున్న రైలులో ఓ ప్రయాణికుడు చేసిన నిర్వాకం తీవ్ర దుమారం రేపుతోంది. వందలాది మంది ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి, ఏసీ కోచ్‌లోనే దీపం, అగరుబత్తీలు వెలిగించి పూజలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత విశ్వాసాలు ముఖ్యమే అయినప్పటికీ, సాటి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టడం నేరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఓ కదులుతున్న రైల్లోని ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) కోచ్‌లో, పై బెర్త్‌పై కూర్చున్న ఓ వ్యక్తి నూనె దీపం, అగరుబత్తీలు వెలిగించి పూజలు చేయడం ప్రారంభించాడు. కొద్దిసేపటికే బోగీ మొత్తం పొగతో నిండిపోవడంతో ఇది గమనించిన తోటి ప్రయాణికుడు అప్రమత్తమయ్యాడు. వెంటనే అతడి వద్దకు వెళ్లి, కదులుతున్న రైల్లో నిప్పు వెలిగించడం ఎంత ప్రమాదకరమో వివరించి, వెంటనే ఆర్పేయాలని సూచించాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.

‘ఝార్ఖండ్ రైల్ యూజర్స్’ అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ.. "బోగీలో వ్యాపించిన పొగ కారణంగా రైలు ఫైర్ అలారం మోగే ప్రమాదం ఉంది. అలాగే, కదులుతున్న రైల్లో నిప్పును వెలిగించి ఉంచడం పెను అగ్ని ప్రమాదానికి దారితీస్తుంది" అని హెచ్చరించారు. ముఖ్యంగా ఏసీ కోచ్‌లలో ఉండే పరుపులు, కర్టెన్లు, సీట్ల కుషన్లు వంటివి సింథటిక్ పదార్థాలతో తయారు చేస్తారని, ఇవి చాలా వేగంగా మంటలను అందుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అగరుబత్తీల పొగకు ఆటోమేటిక్ స్మోక్ డిటెక్టర్లు యాక్టివేట్ అయి, రైలు ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్‌ను సైతం ఆన్ చేసే అవకాశం ఉంది.

స్పందించిన రైల్వే శాఖ.. 
ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే శాఖ స్పందించింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక ఫిర్యాదుల విభాగం ‘రైల్వే సేవా’ ఈ పోస్టుపై స్పందిస్తూ.. విచారణ ప్రారంభించేందుకు రైలు నంబర్, ప్రయాణ తేదీ, పీఎన్ఆర్ వంటి వివరాలు అందించాలని కోరింది. త్వరితగతిన సమస్యల పరిష్కారం కోసం ప్రయాణికులు నేరుగా ‘రైల్‌మదద్’ పోర్టల్ (railmadad.indianrailways.gov.in) ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.

నెటిజన్ల తీవ్ర ఆగ్రహం 
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. "ఇలాంటి ఘోరమైన తప్పిదం ప్రయాణికుల భద్రతకు పెను ముప్పు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి, కఠిన చర్యలు తీసుకోవాలి" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మరో యూజర్ స్పందిస్తూ, "రైళ్లలో అగ్గిపెట్టెలు అమ్మడానికి కూడా వెండర్లను అనుమతించరు. అలాంటిది, బోగీలో నిప్పు రాజేసిన ప్రయాణికులపై భారీ జరిమానా విధించి, ఎదురు తిరిగితే అరెస్ట్ చేయాలి" అని డిమాండ్ చేశారు. "ఐఆర్‌సీటీసీ యాప్‌లో ఫోటోలు అప్‌లోడ్ చేసి, భద్రతా ఉల్లంఘనలను రిపోర్ట్ చేసే సదుపాయం కల్పించాలి. దీనివల్ల ఆర్పీఎఫ్ వెంటనే స్పందించే వీలుంటుంది" అని మరికొందరు సూచించారు.
Advertisement
Passenger
Indian Railways
Train AC coach puja
Viral video train safety
Railway fire hazard
RailMadad complaint

More Telugu News