చనిపోయాడనుకుంటే 31 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం.. బిహార్‌లో వింత ఘటన!

Sadhu Sharma returns after 31 years thought to be dead in Bihar strange incident
  • 31 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా ఇంటికి చేరిన వ్యక్తి
  • చనిపోయాడని భావించిన కుటుంబ సభ్యులకు ఊహించని షాక్
  • పెళ్లైన రెండు నెలలకే ఉపాధి కోసం ఢిల్లీకి వెళ్లి అదృశ్యం
  • ఇన్నేళ్లుగా ఢిల్లీలోనే ఉన్నానని తెలిపిన సాధు శర్మ
  • అతడిని చూసేందుకు తరలివస్తున్న గ్రామస్థులు
బీహార్‌లోని గయ జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగుచూసింది. గత 31 ఏళ్ల క్రితం అదృశ్యమై, అప్పటికే మరణించి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించిన వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షం కావడంతో గ్రామస్థులు విస్మయం చెందుతున్నారు. దీనిని గ్రామస్థులు ఒక అద్భుతంగా అభివర్ణిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వజీర్‌గంజ్ బ్లాక్‌లోని కేనార్ చట్టి గ్రామానికి చెందిన సాధు శర్మకు 1995 ఏప్రిల్‌లో వివాహం జరిగింది. పెళ్లైన కేవలం రెండు నెలలకే, 18 ఏళ్ల వయసులో జీవనోపాధి నిమిత్తం ఆయన ఢిల్లీకి వెళ్లారు. తొలినాళ్లలో రెండు మూడు ఉత్తరాలు రాసినప్పటికీ, ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేదు. కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నించినా ఆచూకీ లభించకపోవడంతో, సాధు శర్మ మరణించి ఉంటాడని అంతా భావించారు. తన కుమారుడి రాక కోసం నిరీక్షిస్తూనే తండ్రి గణౌరీ ఠాకూర్, తల్లి కల్సియా దేవి మరణించారు. సాధు శర్మ అదృశ్యమైన రెండేళ్ల తర్వాత ఆయన భార్యకు కుటుంబ సభ్యులు మరువివాహం జరిపించారు.

ఈ నేపథ్యంలో, ఈ నెల 26వ తేదీన సాధు శర్మ (ప్రస్తుతం 49 ఏళ్లు) అకస్మాత్తుగా తన స్వగ్రామానికి చేరుకున్నారు. అతడిని చూడగానే వదిన దేవంతి దేవి భావోద్వేగానికి లోనయ్యారు. "భగవంతుడు అద్భుతం చేశాడు.. మా మరిది కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశాం" అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

గత 31 ఏళ్లుగా ఢిల్లీలోనే ఉంటూ వైరింగ్ పనులు చేసుకుని జీవనం సాగించినట్లు సాధు శర్మ వెల్లడించారు. అయితే, ఇన్నేళ్ల పాటు కుటుంబ సభ్యులను ఎందుకు సంప్రదించలేదన్న ప్రశ్నకు ఆయన దగ్గర సరైన సమాధానం లేదు. సాధు శర్మ రాకతో ఆ కుటుంబంలో సంతోషం నెలకొనగా, ఈ వింత విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆయనను చూసేందుకు తరలివస్తున్నారు.
Advertisement
Sadhu Sharma
Bihar missing man returns
Gaya Bihar news
Man reappears after 31 years
Missing person Delhi Bihar
Bihar strange incident

More Telugu News