టీమిండియా ఆల్‌రౌండర్లు, పాండ్య సోదరులైన కృనాల్, హార్దిక్ మధ్య విభేదాలు తలెత్తాయంటూ వస్తున్న వార్తలపై కృనాల్ పాండ్య స్పందించాడు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, తమ బంధం మైదానంలోనూ, బయట కూడా చాలా బలంగా ఉందని స్పష్టం చేశాడు. 

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఔటైనప్పుడు కృనాల్ ఉత్సాహంగా సంబరాలు చేసుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి తోడు, ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత హార్దిక్ తన సోదరుడిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది.

ఈ ఊహాగానాలపై కృనాల్ స్పందిస్తూ, "మేమిద్దరం కలిసే క్రికెట్ ఆడాం. ఆటలోని వ్యూహాలు, టెక్నిక్ గురించి ఎప్పుడూ చర్చించుకుంటాం. మా మధ్య ఆరోగ్యకరమైన చర్చే ఉంటుంది. ఒకే క్రీడలో ఇద్దరు సోదరులు ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తారు. దేవుడి దయవల్ల పాండ్య కుటుంబంలో 10 ఐపీఎల్ ట్రోఫీలు ఉండటం చిన్న విషయం కాదు" అని వివరించాడు. హార్దిక్ 5, తాను 5 ఐపీఎల్ టైటిళ్లు గెలిచామని తెలిపాడు.