పవన్ కల్యాణ్ తెలంగాణలో సభ పెట్టుకోవచ్చు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి
- తెలంగాణలో పవన్ సభ పెట్టుకోవడంపై అభ్యంతరం లేదన్న యెన్నెం
- తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే మాత్రం ఊరుకోబోమని హెచ్చరిక
- జగన్ కు కేసీఆర్ తెరవెనుక సహాయం చేశారని ఆరోపణ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పన్నెండేళ్లు పూర్తయిన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బీఆర్ఎస్ పార్టీ కావాలనే వైషమ్యాలు రెచ్చగొడుతోందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలో సభలు నిర్వహించుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా సభలు పెట్టుకునే హక్కు అందరికీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే సభల పేరుతో తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే మాత్రం తాము చూస్తూ ఊరుకునేది లేదని ఆయన తేల్చిచెప్పారు.
నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత జగన్ తో కలిసి కేసీఆర్ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నాడు ఏపీ ఎన్నికల్లో జగన్ వ్యతిరేకులను ఓడించడానికి కేసీఆర్ అన్ని విధాలుగా తెరవెనుక సహాయం చేశారని, అలాంటి వ్యక్తులు ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం అంటూ నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎండగట్టారు.
రాబోయే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ముమ్మాటికీ తమ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల కంటే తమ ప్రభుత్వమే ప్రజా సంక్షేమంలో ముందుంటుందని జోస్యం చెప్పారు.
పవన్ కల్యాణ్ హైదరాబాద్ సభను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ నేతలకు ఆయన కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. గతంలో ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయలేదా అని ప్రశ్నించిన యెన్నెం.. స్వయంగా కేసీఆర్ తన కుమారుడికి ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతోనే కేటీఆర్ అని పేరు పెట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి నేపథ్యం ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.