ఆర్సీబీ డబుల్ ధమాకా.. బెంగళూరులో రాత్రంతా రోడ్లపై ఫ్యాన్స్ హంగామా చూశారా?
- వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ
- గతేడాది జరిగిన తొక్కిసలాట విషాదం నేపథ్యంలో బెంగళూరులో భారీ భద్రత
- పటిష్ఠ బందోబస్త్ మధ్య ప్రశాంతంగా, అదుపు తప్పకుండా అభిమానుల సంబరాలు
- విషాద ఘటన బాధితులకు జెర్సీ నెం.11, ప్రత్యేక సీట్లతో ఫ్రాంచైజీ నివాళి
గతేడాది చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన పునరావృతం కాకుండా నగర పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. నగరం ప్రధాన ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించి, అభిమానుల సంబరాలు అదుపు తప్పకుండా చూశారు. డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలు, వేగ నియంత్రణ కోసం కొన్ని రోడ్లను మూసివేయడం వంటి చర్యలు తీసుకున్నామని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ తెలిపారు. "ప్రజలు సరైన స్ఫూర్తితో సంబరాలు చేసుకోవాలి. శాంతికి భంగం కలిగించవద్దు" అని ఆయన విజ్ఞప్తి చేశారు.
పోలీసుల పహారా మధ్యలోనే ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి డ్యాన్సులు చేస్తూ, తమ జట్టు విజయాన్ని, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రదర్శనను కొనియాడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. ఛేజింగ్‌లో కోహ్లీ అజేయ అర్ధ సెంచరీతో రాణించడం వారి ఆనందాన్ని రెట్టింపు చేసింది.
ఈ సంతోష సమయంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ గతేడాది మరణించిన అభిమానులను స్మరించుకోవడం అందరినీ కదిలించింది. ఈ విజయం తనకు అద్భుతమైన పుట్టినరోజు కానుక అని పేర్కొన్నాడు. ఆ విషాద ఘటనకు నివాళిగా చిన్నస్వామి స్టేడియంలో 11 శాశ్వత సీట్లను వారి జ్ఞాపకార్థం కేటాయించారు. గతేడాది ఘటన తర్వాత దాదాపు 8 నెలల పాటు చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగలేదు. పలు తనిఖీల తర్వాతే బీసీసీఐ మళ్లీ అనుమతులు ఇచ్చింది.
భారత్‌లో ఏ వేదికపై ఆడినా తమకు మద్దతు లభిస్తుందని, 'మాకు ఏడు కాదు, 14 హోమ్ గేమ్‌లు' అని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించడం జట్టుకు ఉన్న అశేష అభిమాన గణానికి నిదర్శనం.