అమెరికాలో కూలిన హెలికాప్టర్.. పెళ్లయిన కొన్ని గంటలకే కేరళ పైలట్ మృతి!

Dave Faizi Kerala pilot dies in US helicopter crash after wedding
  • ఒక్కటైన కాసేపటికే విడదీసిన విధి
  • ప్రతికూల వాతావరణంలో కూలిన హెలికాప్టర్ 
  • ఐదు గంటల పాటు శవం కిందే చిక్కుకుపోయిన నూతన వధువు
వందలాది మంది బంధుమిత్రుల సాక్షిగా.. ఆనందోల్లాసాల మధ్య ఆ ఇద్దరి కల్యాణం ఎంతో వైభవంగా జరిగింది. అంతా కలిసి ది పర్ఫెక్ట్ వెడ్డింగ్ అనుకున్నారు. కానీ, ఆ బంధం పట్టుమని పది గంటలైనా గడవక ముందే విధి అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఆ నూతన వధూవరుల ప్రయాణం.. ఒక ఘోర హెలికాప్టర్ ప్రమాదంతో విషాదాంతమైంది. 

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన ఒక ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ పైలట్ డేవ్ ఫైజీ (25) అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, అతడి భార్య జెస్ని తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ప్రమాదంలో హెలికాప్టర్ నడుపుతోన్న ప్రధాన పైలట్ కూడా మృతి చెందాడు. మృతుడు డేవ్ తల్లిదండ్రులు జార్జ్, ఫీబా కొన్నేళ్ల క్రితం కేరళలోని ఎర్నాకుళం (మువట్టుపుజ) నుంచి అమెరికాకు వలస రాగా, వధువు జెస్ని కుటుంబానికి కూడా కేరళలోని అలప్పుళ జిల్లాతో సంబంధాలు ఉన్నాయి.

అసలు ఆ రాత్రి ఏం జరిగిందంటే.. 
శుక్రవారం డాసన్‌విల్లే పరిసరాల్లోని 'ది రివెరె' వెడ్డింగ్ హాల్‌లో డేవ్, జెస్నిల వివాహం ఘనంగా ముగిసింది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వేడుకలు ముగిశాక ఈ కొత్త జంట అట్లాంటా డౌన్‌టౌన్‌లోని ఒక హోటల్‌కు వెళ్లేందుకు ప్రైవేట్ హెలికాప్టర్‌ ఎక్కాల్సి ఉంది. అయితే అప్పటికే అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. దట్టమైన పొగమంచు, భారీ వర్షం కారణంగా ముందు దారి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. తాను స్వయంగా కమర్షియల్ పైలట్ కావడంతో.. "ఇలాంటి బ్యాడ్ వెదర్‌లో నేను అస్సలు ప్రయాణించను, ఇప్పట్లో టేకాఫ్ వద్దు" అని డేవ్ తన తండ్రితో గట్టిగా చెప్పాడు. కానీ, ప్రైవేట్ హెలికాప్టర్ పైలట్ మాత్రం.. "మనం కాస్త ఎక్కువ ఎత్తులో (హై ఆల్టిట్యూడ్) వెళ్దాం, ఏం కాదు" అని నమ్మబలికి రాత్రి 10:30 గంటల ప్రాంతంలో రాబిన్సన్ R66 హెలికాప్టర్‌ను గాల్లోకి లేపాడు. దురదృష్టవశాత్తూ, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ హెలికాప్టర్ డాసన్‌విల్లే నైరుతి దిశలో ఉన్న దట్టమైన అడవులు, కొండల మధ్య కూలిపోయింది.

ఈ భీకర ప్రమాదంలో హెలికాప్టర్ ముక్కలై చెట్ల మధ్య పడిపోగా.. తీవ్రంగా గాయపడిన వధువు జెస్ని ఆ శిథిలాలు, విరిగిపడిన చెట్ల కింద దాదాపు ఐదు గంటల పాటు కదల్లేని స్థితిలో చిక్కుకుపోయింది. ఆ భయానక నరకాన్ని గుర్తుచేసుకుంటూ జెస్ని మామ జార్జ్ ఫైజీ కన్నీరుమున్నీరయ్యారు. "నా కోడలు స్పృహలోకి వచ్చేసరికి చుట్టూ దట్టమైన అడవి, శిథిలాలు ఉన్నాయి. ఆమె రొమ్ముపై నా కొడుకు డేవ్ పడిపోయి ఉన్నాడు. జెస్ని స్వయంగా నర్సు కావడంతో.. తల తాకి చూసి, గట్టిగా పిలిచింది. కానీ అప్పటికే నా కొడుకు శరీరం మంచులా చల్లబడిపోయింది.. ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి" అంటూ ఏడ్చేశారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో కమ్యూనికేషన్ నెట్‌వర్క్ లేకపోవడం, రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో ఆరు గంటల పాటు శ్రమించి ఆఫ్‌రోడ్ వాహనాల సాయంతో రెస్క్యూ టీమ్ జెస్నిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఒళ్లంతా తీవ్రమైన గాయాలయ్యాయి. మానసికంగా ఆమె పూర్తిగా కుంగిపోయింది. ఈ ఊహించని విషాదంపై అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB) విచారణ ప్రారంభించింది.
Go Back to Shorts
Dave Faizi
Kerala pilot
helicopter crash
US accident
wedding tragedy
Delta Airlines pilot
Jesni
Dawsonville Georgia
Ernakulam
private helicopter

More Telugu News