క్యాండీ క్రష్ గేమ్‌లో ప్రపంచ రికార్డ్.. 22,222వ లెవెల్ దాటిన బీహార్ కుర్రాడు!
Add ap7am to your home Screen

క్యాండీ క్రష్ గేమ్‌లో ప్రపంచ రికార్డ్.. 22,222వ లెవెల్ దాటిన బీహార్ కుర్రాడు!

Shubham Kumar sets world record by crossing level 22222 in Candy Crush game
  • అరుదైన ఘనతతో 'ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌'లో చోటు
  • శివాన్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి శుభం కుమార్‌పై ప్రశంసలు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన యువకుడి అరుదైన రికార్డ్
  • శుభంను అభినందించిన బీహార్ ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ
కాలక్షేపం కోసం ఆడే మొబైల్ గేమ్‌తో ఓ యువకుడు ఏకంగా ప్రపంచ రికార్డునే సృష్టించాడు. అత్యంత ప్రజాదరణ పొందిన 'క్యాండీ క్రష్ సాగా' పజిల్ గేమ్‌లో ఏకంగా 22,222వ లెవెల్ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అరుదైన ఘనత సాధించినందుకుగానూ బీహార్‌కు చెందిన 19 ఏళ్ల శుభం కుమార్ పేరు 'ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌'లో నమోదైంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బీహార్‌లోని దిగ్వారా ప్రాంతానికి చెందిన శుభం కుమార్.. శివాన్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. అతను ఈ ఏడాది జులై 5వ తేదీ నాటికి క్యాండీ క్రష్ గేమ్‌లో 22,222వ లెవెల్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ సమయానికి అతని వయసు 19 సంవత్సరాల 8 నెలల 25 రోజులు. దీంతో 'క్యాండీ క్రష్ సాగాలో అత్యధిక లెవెల్ సాధించిన టీనేజర్' విభాగంలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అతనికి అధికారికంగా గుర్తింపునిచ్చింది.

రంగురంగుల క్యాండీలను జత చేస్తూ లెవెల్స్ దాటడమే ఈ గేమ్‌లోని ప్రధాన అంశం. లెవెల్స్ పెరిగే కొద్దీ ఆట కఠినంగా మారుతుంది. అయితే, శుభం కుమార్ ఈ రికార్డు సాధించాక కూడా ఆటను ఆపలేదు. ప్రస్తుతం తాను 23,000వ లెవెల్‌ను కూడా దాటినట్లు తెలిపాడు. ఈ ఘనత గురించి తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంత ఓపిక, ఏకాగ్రత ఎలా సాధ్యమైందని కొందరు కామెంట్లు పెడుతుండగా, ఈ లెవెల్‌కు చేరుకోవడానికి ఎంత స్క్రీన్ టైమ్ పట్టి ఉంటుందోనని మరికొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకవైపు ఇంజినీరింగ్ లాంటి కష్టమైన చదువు చదువుతూనే, మరోవైపు గేమ్‌లో ఈ స్థాయిలో రాణించడంపై పలువురు అతన్ని అభినందిస్తున్నారు. ఈ అరుదైన విజయం సాధించినందుకు బీహార్ రాష్ట్ర సైన్స్, టెక్నాలజీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగం కూడా శుభం కుమార్‌ను అభినందించడం విశేషం. 
Advertisement
Shubham Kumar
Candy Crush Saga world record
Bihar teenager record
International Book of Records
Candy Crush level 22222
Mobile gaming achievements

More Telugu News