నార్వే చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఛాంపియన్ డి.గుకేశ్‌కు వింత, సరదా అనుభవం ఎదురైంది. వెస్లీ సోతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ మధ్యలో గుకేశ్‌ వాటర్ బాటిల్ క్యాప్ తీయడానికి పడ్డ తిప్పలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆటలో తీవ్రంగా ఆలోచిస్తూ పక్కనే ఉన్న బాటిల్ మూత తీయడానికి ప్రయత్నించి అది రాకపోవడంతో అతడు బిక్కమొహం వేసిన విజువల్స్ నెటిజన్లను నవ్విస్తున్నాయి.

చేజారిన విజయం
క్లాసికల్ రౌండ్-2 మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు వెస్లీ సోపై గుకేశ్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఏకంగా 116 ఎత్తుల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మారథాన్ పోరులో గుకేశ్‌ విజయం సాధించేలా కనిపించాడు. అయితే వెస్లీ అద్భుతంగా డిఫెన్స్ చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించగలిగాడు. తర్వాత ఫలితం కోసం నిర్వహించిన ‘ఆర్మగెడాన్’ (టై బ్రేకర్) మ్యాచ్‌లో వెస్లీ పైచేయి సాధించి 1.5 పాయింట్లు ఖాతాలో వేసుకోగా, గుకేశ్‌ కేవలం ఒక పాయింట్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

వెస్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
సుదీర్ఘ పోరాటం తర్వాత ఓటమి పాలవడంతో గుకేశ్‌ తీవ్ర నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన అసంతృప్తిని దాచుకోలేకపోయాడు. దీనికి తోడు వెస్లీ మాట్లాడుతూ.. గుకేశ్‌ ప్రస్తుత రేటింగ్ అతడి అసలు ప్రతిభకు అద్దం పట్టడం లేదంటూ కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేవలం 19 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌‌కు ఈ ఓటమి మానసికంగా కాస్త నిరాశ కలిగించింది.

గాయంతోనూ గెలిచిన ఫిరౌజా
టోర్నీలోని ఇతర మ్యాచ్‌ల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అలిరెజా ఫిరౌజా చీలమండ గాయంతో బాధపడుతూ, చేతికర్రల సాయంతో నడుస్తూనే భారత ఆటగాడు ప్రజ్ఞానందపై ఘన విజయం సాధించి తన ఫామ్‌ను చాటుకున్నాడు. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ సైతం జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ చేతిలో ఓడిపోయే ప్రమాదం నుంచి తప్పించుకుని, ఆర్మగెడాన్ రౌండ్‌లో ఈ టోర్నీలో తన మొదటి విజయాన్ని నమోదు చేశాడు.