ఆధార్‌ కీలక నిర్ణయం.. పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్ బంద్

UIDAI to Shut Down Old mAadhaar App Launching New Aadhaar App
  • కొత్త అధికారిక ఆధార్ యాప్ విడుదల
  • అందుబాటులోకి క్యూఆర్ కోడ్, ఫేస్ అథెంటికేషన్
  • బయోమెట్రిక్ డేటాను లాక్ చేసే వెసులుబాటు
  • ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు పెంపు
స్మార్ట్‌ఫోన్లలో ఆధార్ సేవలను ఉపయోగించే పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక మార్పును ప్రకటించింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పాత ‘ఎమ్-ఆధార్’ యాప్‌ను త్వరలోనే పూర్తిగా నిలిపివేయనున్నారు. దీని స్థానంలో మరింత భద్రత, ఆధునిక ఫీచర్లతో కూడిన సరికొత్త ‘ఆధార్’ యాప్‌ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వెంటనే కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’ ద్వారా ప్రభుత్వం కోరింది.

పటిష్ఠ భద్రత
పాత యాప్‌లో లాగిన్ లేదా అథెంటికేషన్ సమయంలో యూజర్ల పూర్తి వివరాలు స్క్రీన్‌పై కనిపించేవి. కానీ ఈ కొత్త యాప్‌లో డేటా ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హోటళ్లు, ఆసుపత్రులు లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో వెరిఫికేషన్ కోసం ఇకపై పూర్తి వివరాలను చూపించాల్సిన అవసరం లేదు. కేవలం యాప్‌లోని సురక్షిత క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అవసరమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయవచ్చు. అంతేకాకుండా కేవలం ఎస్ఎంఎస్ ఓటీపీలపైనే ఆధారపడకుండా రక్షణ కోసం ఫేస్ అథెంటికేషన్ (ఫేస్ ఐడీ), బయోమెట్రిక్ లాక్ వంటి అదనపు భద్రతా లేయర్లను ఇందులో చేర్చారు. వినియోగదారులు తమ వేలిముద్రలు లేదా ఐరిస్ డేటాను యాప్ ద్వారానే లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు.

కొత్త ఆధార్ యాప్‌ను సెటప్ చేయడం ఎలా?
  • గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి అధికారిక ‘Aadhaar’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • యాప్ ఓపెన్ చేసి మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  • మీ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. సెటప్ ప్రక్రియలో భాగంగా కొన్నిసార్లు ఫేస్ అథెంటికేషన్ కూడా అడగవచ్చు.
  • యాప్ సెక్యూరిటీ కోసం ఒక సురక్షితమైన పిన్ నంబర్‌ను క్రియేట్ చేసుకోవాలి లేదా బయోమెట్రిక్ అన్‌లాక్ ఎనేబుల్ చేసుకోవాలి.
చివరగా ఆధార్ నంబర్‌ను జోడించి మరో ఓటీపీతో ప్రక్రియను పూర్తి చేయాలి.

ఉచిత అప్‌డేట్ గడువు పెంపు
యాప్ మార్పుతో పాటు ఆధార్ వినియోగదారులకు యూఐడీఏఐ మరో తీపి కబురు అందించింది. ‘మైఆధార్’ పోర్టల్‌లో ఉచితంగా ఐడెంటిటీ, అడ్రస్ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌ ద్వారా అప్‌డేట్ చేసుకునే గడువును పొడిగించింది. నిజానికి ఈ ఉచిత సేవలు 2026 జూన్ 15 వరకే అందుబాటులో ఉండాల్సి ఉంది. కానీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పౌరులు తమ వివరాలను 2027 జూన్ 14 వరకు ఎలాంటి రుసుము లేకుండా అప్‌డేట్ చేసుకోవచ్చు.
Go Back to Shorts
UIDAI
Aadhaar
mAadhaar app
Aadhaar app update
UIDAI update
Aadhaar services
face authentication
biometric lock
Aadhaar update free
My Aadhaar portal

More Telugu News