ముంబైలో నాలుగు దశాబ్దాలుగా ఆహార ప్రియుల మన్ననలు పొందుతున్న ప్రఖ్యాత శాకాహార రెస్టారెంట్ 'శివ్ సాగర్' ఇప్పుడు హైదరాబాద్ నగరంలోకి అడుగుపెట్టింది. జూబ్లీహిల్స్‌లో తమ తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించి, ముంబై స్ట్రీట్ ఫుడ్ రుచులను నగరవాసులకు పరిచయం చేస్తోంది. 1981లో ముంబైలో ప్రారంభమైన ఈ బ్రాండ్, ముంబై వెలుపల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది.

సాధారణంగా ఉడుపి రెస్టారెంట్లు ఇడ్లీ, దోస వంటి దక్షిణ భారత వంటకాలపై దృష్టిపెట్టే రోజుల్లో, శివ్ సాగర్.. ముంబై స్ట్రీట్ ఫుడ్‌ను మెయిన్‌స్ట్రీమ్ రెస్టారెంట్ సంస్కృతిలోకి తీసుకువచ్చి ప్రత్యేకతను చాటుకుంది. ముఖ్యంగా ఇక్కడి బాంబే స్టైల్ పావ్ భాజీ, అముల్ చీజ్‌తో చేసే ముంబై స్టైల్ పిజ్జాలు, ఫలూదాలు, డ్రై ఫ్రూట్ మిల్క్‌షేక్‌లు, చైనీస్ భేల్ వంటి ఇండో-చైనీస్ వంటకాలకు ఎంతో పేరుంది.

ఈ సందర్భంగా బ్రాండ్ ప్రతినిధి శ్రీధర్ ఎస్. పూజారి మాట్లాడుతూ.. "హైదరాబాద్ వైవిధ్యమైన రుచులను ఆదరించే నగరం. అందుకే మా విస్తరణకు జూబ్లీ హిల్స్ సరైన ప్రదేశమని భావించాం. ముంబైలో మాకు లభించిన ఆదరణ, కస్టమర్ లాయల్టీని ఇక్కడ కూడా సంపాదించడమే మా లక్ష్యం" అని తెలిపారు. ముంబై నాస్టాల్జియాను గుర్తుచేసే ఈ రెస్టారెంట్, హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు ఒక సరికొత్త అనుభూతిని అందించనుంది.