రుణాల రికవరీలో ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే కుదరదు... ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు

RBI Proposes Key Regulations for Loan Recoveries
  • లోన్ రికవరీ పేరుతో కస్టమర్లను వేధించే ఆర్థిక సంస్థలకు అడ్డుకట్ట
  • ఫోన్ బ్లాక్ చేయడం కుదరదన్న ఆర్బీఐ
  • నోటీసులు ఇచ్చినా కస్టమర్ స్పందించకుంటే చర్యలు తీసుకోవచ్చన్న ఆర్బీఐ
  • కస్టమర్ తన బకాయిని చెల్లిస్తే గంటలో ఆంక్షలు తొలగించాలి
రుణాల రికరీకి సంబంధించి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన నిబంధనలను ప్రతిపాదించింది. లోన్ల రికవరీ పేరుతో కస్టమర్లను వేధించే ఆర్థిక సంస్థలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. ఈ మేరకు కండక్ట్ ఆఫ్ రెగ్యులేటెడ్ ఎంటీటీఎస్ ఇన్ రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ రికవరీ ఏజెంట్స్ పేరిట ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనలపై మే 31వ తేదీ వరకు వాటాదారులు, ప్రజల అభిప్రాయాలను ఆర్బీఐ సేకరించనుంది. ఆ తర్వాత అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ ప్రతిపాదనల్లో కీలక అంశాలు ఉన్నాయి.

వ్యక్తిగత, కారు, హోమ్ లోన్లకు సంబంధించి రుణగ్రహీత సకాలంలో తిరిగి చెల్లింపులు చేయనప్పుడు మొబైల్ ఫోన్‌ను లాక్ చేయడం, దాని ఫీచర్లను నిలిపివేయడం వంటివి బ్యాంకులు చేయకూడదని ప్రతిపాదనల్లో పేర్కొంది. ఒకవేళ ఆ మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్లను కొనుగోలు చేయడానికి సదరు ఆర్థిక సంస్థ లోన్ ఇచ్చి ఉంటే అప్పుడు మాత్రమే ఫోన్ ఫీచర్లను నిలిపివేసే హక్కు బ్యాంకుకు ఉంటుందని స్పష్టం చేసింది. అది కూడా లోన్ బకాయిపడి 90 రోజులు గడువు దాటి ఉండాలి. కస్టమర్లకు నోటీసులు ఇచ్చినా స్పందించకుంటే అప్పుడు చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.

ఫోన్ బ్లాక్ చేసినప్పటికీ ఇంటర్నెట్, ఇన్‌కమింగ్ కాల్స్, అత్యవసర సేవలు, ప్రభుత్వ ఎమర్జెన్సీ అలర్టులు నిలిపివేయవద్దని పేర్కొంది. ఒకవేళ కస్టమర్ తన బకాయిని చెల్లిస్తే గంటలోనే ఫోన్‌పై ఉన్న ఆంక్షలు తొలగించాలి. ఆలస్యమైతే గంటకు రూ.250 చొప్పున బ్యాంకే తిరిగి రుణగ్రహీతకు పరిహారంగా చెల్లించాలని పేర్కొంది.

లోన్ రికవరీ కోసం బ్యాంకు ఉద్యోగులు లేదా రికవరీ ఏజెంట్లు చేసే అన్ని కాల్స్ సమయం, నెంబర్లను రికార్డు చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. అలాగే వారు చేసే ఆడియో, టెక్స్ట్ సంభాషణలను భద్రపరచాలని బ్యాంకులకు సూచించింది. రుణాల వసూళ్ళలో లోన్ ఏజెంట్లు లేదా ఉద్యోగులు అసభ్యపదజాలం, బెదిరింపులకు దిగడం వంటివి చేయకూడదని పేర్కొంది. కస్టమర్ల వ్యక్తిగత విరాలు, ఆడియా లేదా వీడియో రికార్డులను సోషల్ మీడియాలో పెట్టడం, సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్య సందేశాలు పంపడం, కాల్స్ చేసి పదేపదే వేధించడం వంటివి చేయకూడదని ఆర్బీఐ ప్రతిపాదించింది.
Go Back to Shorts
RBI
RBI guidelines
loan recovery
loan recovery agents
banks
NBFCs
loan repayment
mobile phone lock

More Telugu News