కువైట్‌లోని తెలుగు మహిళకు అండగా ప్రభుత్వం.. సురక్షితంగా రప్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశం

Chandrababu Naidu Orders Safe Return of Telugu Woman from Kuwait
  • కువైట్‌లో వేధింపులకు గురవుతున్న తిరుపతి జిల్లా మహిళ
  • సెల్ఫీ వీడియో ద్వారా ప్రభుత్వానికి సాయం కోసం విజ్ఞప్తి
  • తక్షణం స్పందించి రప్పించాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు,
  • భారత రాయబార కార్యాలయంతో ఏపీఎన్‌ఆర్టీ సంప్రదింపులు
  • ఘటనకు బాధ్యులైన ఏజెంట్లపై విచారణకు సీఎం ఆదేశం
కువైట్‌లో వేధింపులకు గురవుతూ, స్వదేశానికి రాలేక ఇబ్బంది పడుతున్న తిరుపతి జిల్లా మహిళ భాగ్యవతి విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణం స్పందించారు. ఆమెను వీలైనంత త్వరగా, సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.

వివరాల్లోకి వెళ్తే, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి చెందిన భాగ్యవతి ఉపాధి నిమిత్తం ఈ ఏడాది ఫిబ్రవరిలో కువైట్ వెళ్లారు. అక్కడ గృహ సహాయకురాలిగా పనిచేస్తున్న ఆమెను యజమానులు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారని, తిరిగి పంపించమని అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను తెలియజేశారు. ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వచ్చింది.

దీనిపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు, ఏపీ ప్రవాసాంధ్రుల సంస్థ (ఏపీఎన్‌ఆర్టీ) ద్వారా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఏపీఎన్‌ఆర్టీ అధికారులు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి, భాగ్యవతిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ ఘటనకు కారణమైన ఏజెంట్ల పాత్రపై విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.

మరోవైపు, తిరుపతి జిల్లా యంత్రాంగం, స్థానిక పోలీసులు భాగ్యవతి కుటుంబ సభ్యులతో నిరంతరం మాట్లాడుతూ వారికి ధైర్యం చెబుతున్నారు. ఆమె సురక్షితంగా తిరిగి వచ్చేవరకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇచ్చారు.
 
Go Back to Shorts
Chandrababu Naidu
Bhagyavathi
Kuwait
Telugu woman
NRI
APNRT
Repatriation
Domestic violence
Tirupati district
Andhra Pradesh government

More Telugu News