పవన్ కల్యాణ్ పై ఆరోపణలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ పై కేసు నమోదు
- కేంద్ర నిధులను పవన్ దారి మళ్లించారన్న నాగార్జున యాదవ్
- పవన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారంటూ జనసైనికుల ఆగ్రహం
- సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దారి మళ్లించారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్సీ నాగార్జున యాదవ్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై జనసేన నాయకుడు రామ సైదులు పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నాగార్జున యాదవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కాగా, నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు సృష్టించేలా ఉన్నాయని జనసేన పార్టీ వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. ప్రభుత్వ ప్రతిష్ఠను, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఈ ప్రచారం సాగుతోందని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.