విజయవాడ వెస్ట్ బైపాస్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను గడ్కరీ దృష్టికి తీసుకుపోయిన పెమ్మసాని
- నితిన్ గడ్కరీతో పెమ్మసాని, అశ్విని వైష్ణవ్ తో లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ
- ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారంపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ
- పిడుగురాళ్ల - శావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టు వరకు కొత్త రైల్వే లైన్ వేయాలని కోరిన శ్రీకృష్ణదేవరాయలు
ఏపీలో రోడ్డు రవాణా, రైల్వే కనెక్టివిటీ మెరుగుపరచడమే లక్ష్యంగా ఇవాళ ఢిల్లీలో చర్చలు సాగాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో టీడీపీ నేత, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భేటీ అయ్యారు. విజయవాడ వెస్ట్ బైపాస్ వద్ద నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందులను ఈ సందర్భంగా గడ్కరీకి పెమ్మసాని వివరించారు. ఎన్ హెచ్-16, వెస్ట్ బైపాస్ కలిసే చిన్నకాకాని (కాజా) జంక్షన్ వద్ద గ్రేడ్ సెపరేటెడ్ ఇంటర్‌చేంజ్ లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయని తెలిపారు. హైల్యాండ్ ఫ్లైఓవర్ కింద ఉన్న ఇరుకైన సర్వీస్ రోడ్ల వల్ల లక్షలాది మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు ప్రాంత పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి కీలక ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా పిడుగురాళ్ల - శావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు కొత్త రైల్వే లైన్ నిర్మించడం వల్ల ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. అలాగే సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలును నడికుడి లేదా పిడుగురాళ్లలో నిలపాలని, విజయవాడ - బెంగళూరు మధ్య కొత్త వందేభారత్ రైలును ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.