'బాహుబలి'కి మెక్సికో స్ఫూర్తి: 'వారణాసి' ఈవెంట్‌లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

SS Rajamouli Inspired by Mexico for Baahubali Varanasi Event Remarks
  • మెక్సికో కామిక్ కాన్‌లో రాజమౌళి 'వారణాసి' ప్రమోషన్
  • బాహుబలి నగర నిర్మాణానికి మాయన్ నాగరికతే స్ఫూర్తి అన్న రాజమౌళి
  • వీడియో ద్వారా పాల్గొన్న రాజమౌళి, వేదికపై నిర్మాత కార్తికేయ
  • 2027 ఏప్రిల్ 7న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు
టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం 'వారణాసి' ప్రమోషన్ల పర్వం అధికారికంగా మొదలైంది. మెక్సికోలో జరిగిన ప్రఖ్యాత 'కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్ (CCXP) 2026' వేదికగా ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి భౌతికంగా హాజరు కానప్పటికీ, ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు మాయన్ నాగరికత, వారి నిర్మాణ శైలి అంటే ఎంతో ఆసక్తి అని తెలిపారు. "నా గత చిత్రం బాహుబలిలో నగర కేంద్రాన్ని, సింహాసనాన్ని ప్రఖ్యాత చిచెన్ ఇట్జా పిరమిడ్ స్ఫూర్తితోనే రూపొందించాను" అని ఆయన వెల్లడించారు. ఈ ప్యానెల్ చర్చలో రాజమౌళి కుమారుడు, చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్.ఎస్. కార్తికేయ స్వయంగా పాల్గొన్నారు. హాజరైన వారి కోసం ప్రత్యేకంగా కొన్ని బిహైండ్-ది-సీన్స్ వీడియోలను ప్రదర్శించారు.

ప్రపంచవ్యాప్తంగా సాగే యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో 'వారణాసి' చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా జోనస్ నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఈవెంట్‌తో 'వారణాసి' గ్లోబల్ ప్రమోషన్లకు శ్రీకారం చుట్టినట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 
Go Back to Shorts
SS Rajamouli
Rajamouli
Varanasi Movie
Mahesh Babu
Priyanka Chopra
Prithviraj Sukumaran
Baahubali
CCXP Mexico
Indian Cinema
Tollywood

More Telugu News