ఢిల్లీలో దారుణం.. ఐఐటీ విద్యార్థినిపై అత్యాచారం, హత్య

IIT Graduate Murder Delhi Shocking Crime
  • అత్యాచారం చేసి, ఫోన్ ఛార్జర్‌తో ఉరివేసిన దుండగుడు
  • నెల క్రితం పని మానేసిన మాజీ సహాయకుడే నిందితుడు
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై అప్పులు చేసినట్లు విచారణలో వెల్లడి
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సీనియర్ బ్యూరోక్రాట్ కుమార్తె, ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన 22 ఏళ్ల యువతి అత్యాచారం, హత్యకు గురైంది. ఆగ్నేయ ఢిల్లీలోని ఈస్ట్ ఆఫ్ కైలాశ్ ప్రాంతంలోని ఆమె నివాసంలో ఈ విషాదం చోటుచేసుకుంది. అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం నిందితుడు ఫోన్ ఛార్జర్ కేబుల్‌తో బాధితురాలి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఘటన జరిగిన సమయంలో యువతి ఇంట్లో ఒంటరిగా ఉంది. కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఆమె అనుమానాస్పద స్థితిలో పడి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్లు లేకపోవడంతో, తెలిసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానించారు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నెల క్రితం పనిలోంచి తీసేసిన 19 ఏళ్ల రాహుల్‌ను నిందితుడిగా గుర్తించారు. ఉదయం 6:28 గంటలకు అతడు ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నట్లు ఫుటేజీలో రికార్డయింది. ద్వారక ప్రాంతంలోని ఒక హోటల్‌లో దాక్కున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడు రాహుల్ ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై, చుట్టుపక్కల వారి వద్ద అప్పులు చేసి తిరిగి చెల్లించకపోవడంతోనే అతడిని పనిలోంచి తీసేశారని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. నిందితుడిపై గతంలో అల్వార్‌లో ఒక లైంగిక వేధింపుల కేసు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. అదనపు తాళం చెవి ఉపయోగించి ఇంట్లోకి ప్రవేశించి ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిపై హత్య, అత్యాచారం, దోపిడీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మృతురాలు డీపీఎస్ ఆర్కే పురంలో పాఠశాల విద్య, ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆమె మంచి నృత్యకారిణిగా పలు అవార్డులు కూడా గెలుచుకుంది. బాధితురాలి పెద్దన్నయ్య ఓ ఎమ్మెన్సీ కంపెనీలో సీనియర్ పొజిషన్‌లో పనిచేస్తుండగా, ఆమె తల్లి వైద్యురాలు.
Go Back to Shorts
IIT Graduate Murder
Delhi Crime
Rahul
East of Kailash
Sexual Assault
Civil Services Exam
Delhi Police
Crime News
Alwar Sexual Harassment Case
Vijay Kumar JCP

More Telugu News