తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ప్రశంసలు లభించాయి. రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో విమాన ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) తగ్గిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్వాగతించారు. విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలంటే కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో విమానయాన సంస్థలకు ఈ నిర్ణయం కొంత ఊరటనివ్వనుంది. 

తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. చెన్నై విమానాశ్రయంలో విమాన ఇంధనం (ఏటీఎఫ్‌)పై వ్యాట్‌ను ప్రస్తుతం ఉన్న 29 శాతం నుంచి 16 శాతానికి తగ్గించారు. రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల్లో ఈ పన్నును 29 శాతం నుంచి కేవలం ఒక శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయం నవంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. 2027 అక్టోబర్‌ 31 వరకు ఈ పన్ను రాయితీ కొనసాగుతుంది. రాష్ట్రంలోని నగరాల మధ్య విమాన సర్వీసులను పెంచడం, విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులను తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యాలు. 

ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. విమాన ఇంధనంపై వ్యాట్‌ తగ్గింపు విమానయాన రంగానికి స్వాగతించదగిన చర్య అని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి విజయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. విమాన ప్రయాణాన్ని మరింత చౌకగా మార్చేందుకు కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని, ప్రయాణికుల ప్రయోజనాలే ఉమ్మడి ప్రాధాన్యంగా ఉండాలని అన్నారు. 

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కూడా తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ముఖ్యమంత్రి విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి చర్యలతో విమాన మార్గాల అనుసంధానం మెరుగుపడుతుందని, రాష్ట్రంలో పర్యాటకం, ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని పేర్కొంది. విమానయాన రంగం మరింత బలోపేతం కావడానికి, విమాన ప్రయాణం ఎక్కువ మందికి అందుబాటులోకి రావడానికి ఇలాంటి నిర్ణయాలు దోహదపడతాయని అభిప్రాయపడింది. 

తమిళనాడులో విమాన ఇంధనంపై అధిక పన్నుల కారణంగా కొత్త విమాన సర్వీసులను ప్రారంభించేందుకు విమానయాన సంస్థలు ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయాలు గతంలో వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కోయంబత్తూరు, సేలం వంటి పారిశ్రామిక నగరాల నుంచి మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభించాలన్న డిమాండ్లు ఉన్నాయి. తాజాగా ప్రకటించిన పన్ను తగ్గింపుతో రాష్ట్రంలోని విమాన కనెక్టివిటీ మెరుగుపడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే, ఈ నిర్ణయం వల్ల విమాన టికెట్ల ధరలు ఎంతమేర తగ్గుతాయన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.