సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 ఫార్మాట్‌లో సరికొత్త సంచలనం సృష్టించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. ఈ శతకంతో, అత్యధిక టీ20 సెంచరీలు సాధించిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.

ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగి, తన ఐపీఎల్ కెరీర్‌లో రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అభిషేక్‌కు ఇది తొమ్మిదో సెంచరీ కావడం విశేషం. ఈ ఘనతతో కోహ్లీ సరసన నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రిస్ గేల్ (22), బాబర్ అజమ్ (12), డేవిడ్ వార్నర్ (10) మాత్రమే వీరిద్దరి కంటే ముందున్నారు. ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్ పలు ఫ్రాంచైజీ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2,000 పరుగుల మైలురాయిని దాటిన నాలుగో ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. గతంలో డేవిడ్ వార్నర్ (4,014), శిఖర్ ధావన్ (2,518), కేన్ విలియమ్సన్ (2,101) మాత్రమే ఈ ఘనత సాధించారు. అంతేకాకుండా, ఫ్రాంచైజీ తరఫున 100కు పైగా సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా (వార్నర్ తర్వాత) రికార్డు సృష్టించాడు.

మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ పిచ్ నెమ్మదించే అవకాశం ఉందని అంచనా వేశాడు. కానీ అభిషేక్ విధ్వంసకర బ్యాటింగ్ చూస్తే పిచ్‌పై ఎలాంటి ఇబ్బందులు లేనట్లే కనిపించింది. ఈ ప్రదర్శనతో పొట్టి ఫార్మాట్‌లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.