వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు... బీజేపీపై కవిత తీవ్ర ఆగ్రహం

K Kavitha Angered Over Women Reservation Bill Failure Blames BJP
  • ప్రతిపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తాయని బీజేపీకి తెలుసన్నకవిత
  • తమకు సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ హడావుడిగా బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శ
  • బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు
  • మహిళ నాయకత్వం వహిస్తున్న పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభించాలని పిలుపు
లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. బీజేపీ దేశ ప్రజలను మరోసారి మోసం చేసిందని కవిత మండిపడ్డారు. అన్నీ తెలిసే బీజేపీ ఈ బిల్లును ప్రవేశపెట్టిందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజనను మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో ముడిపెట్టడం వల్ల ప్రతిపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తాయని అధికార పార్టీకి ముందే తెలుసని అన్నారు.

అయినప్పటికీ ఈ బిల్లులను కలిపి తీసుకువచ్చిందని అన్నారు. తమకు అవసరమైన సంఖ్యాబలం లేదని తెలిసినప్పటికీ ప్రభుత్వం ఈ బిల్లును హడావుడిగా ప్రవేశపెట్టిందని ఆరోపించారు. భారత మహిళల భావోద్వేగాలను బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుందని ధ్వజమెత్తారు. మహిళలందరూ ఈ మోసాన్ని గుర్తించి, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఒక మహిళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, కాబట్టి బీజేపీ పతనాన్ని అక్కడి నుంచి ప్రారంభించాలని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని దీని ద్వారా నిరూపితమైందని అన్నారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలు కూడా బీజేపీ చేసిన మోసాన్ని గుర్తించాలని అన్నారు. బెంగాల్‌లోని మీ స్నేహితులు, సన్నిహితులకు మమతా బెనర్జీకి ఓటు వేసి గెలిపించాలని చెప్పాలని కోరారు.
Go Back to Shorts
K Kavitha
Telangana Jagruthi
Women Reservation Bill
BJP
Lok Sabha
Mamata Banerjee
West Bengal

More Telugu News