తెలంగాణ సమాజానికి తేజస్వీ సూర్య క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్

Tejasvi Surya Must Apologize to Telangana Says KTR
  • తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడంపై ఆగ్రహం
  • తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉండటమేమిటని ప్రశ్న
  • ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపాటు
  • తెలంగాణ వ్యతిరేకత బీజేపీకి నరనరాన నిండి ఉందన్న కేటీఆర్
  • తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీజేపీ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై ఏమాత్రం గౌరవంలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకార పూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమర వీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలు ఈరోజు ఎంపీ తేజస్వీ సూర్య వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంటుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, ఎవరి భిక్ష వల్లనో ఏర్పడలేదని అన్నారు. దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం, వేలాదిమంది యువకుల బలిదానాల ఫలితంగా ఈ గడ్డ విముక్తి పొందిందని గుర్తు చేశారు. అస్తిత్వం కోసం ప్రజలు చేసిన ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాన్ని దేశ విభజన లాంటి విషాదకర సంఘటనలతో పోల్చడం ద్వారా బీజేపీ తన కుసంస్కారాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆయన హెచ్చరించారు.

పార్లమెంటు సాక్షిగా తోటి ఎంపీ తెలంగాణపై విషం చిమ్ముతున్నా, అక్కడే ఉన్న ఎనిమిది మంది రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అత్యంత సిగ్గుచేటని దుయ్యబట్టారు. కనీసం తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండడం దారుణమని అన్నారు. తమ కళ్ల ముందే తెలంగాణను అవమానిస్తున్నా అడ్డుకోలేకపోయిన వీరు, ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్న ఈ ఎంపీల వైఖరిని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు.

తెలంగాణను కించపరిచిన తేజస్వీ సూర్య తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే తేజస్వీ సూర్య వ్యాఖ్యలే బీజేపీ అధికారిక విధానంగా భావించాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
Go Back to Shorts
Tejasvi Surya
KTR
Telangana
Telangana Formation
BRS
BJP
Telangana sentiment
Telangana statehood

More Telugu News