ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు నమ్మిన రైతులు తీవ్రంగా నష్టపోయారు: హరీశ్ రావు

Harish Rao Says Farmers Suffered Heavy Losses Believing Uttam Kumar Reddy Words
  • దేవాదుల నుంచి నీళ్లు రాక రైతులు నష్టపోయారన్న హరీశ్
  • దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో కూడా ఉత్తమ్ కు తెలియదని ఎద్దేవా
  • నీళ్ల  నిర్వహణపై ప్రభుత్వానికి అవగాహన లేదని విమర్శ

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను నమ్మి దేవాదుల ప్రాజెక్టు కింద నారుమడులు పోసుకున్న రైతులు ఇప్పుడు నీళ్లు లేక తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మాటలు నమ్మి నాట్లు వేసుకుంటే, ఇప్పుడు నీళ్లు రాక ఆ నారుమడులన్నీ ముదిరిపోయి పుచ్చిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. 


దేవాదుల నుంచి 38.16 టీఎంసీల నీటిని ఎత్తిపోసి, 22 రిజర్వాయర్లను నింపి ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం డైలాగులు కొట్టిందని విమర్శించారు. అసలు ఆ నీళ్ల మంత్రికి దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో కూడా తెలియదని హరీశ్ ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ల నిర్వహణపై కనీస అవగాహన లేదని విమర్శించారు. దేవాదుల అనేది బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టు అని, ఆ విషయం కూడా కాంగ్రెస్ నాయకులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.


కాళేశ్వరం విషయంలో కుంటిసాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిన ప్రభుత్వం... మరి దేవాదుల వద్ద నీళ్లు ఎత్తడానికి ఏం అడ్డంకి వచ్చిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. తాను ప్రెస్ మీట్ పెట్టి నిలదీసిన తరవాతే మంత్రులు హెలికాప్టర్ వేసుకుని అక్కడికి పరిగెత్తారని తెలిపారు. రేపే మోటార్లు నడుపుతామని మంత్రులు ఒకరిని మించి ఒకరు ఉపన్యాసాలు దంచారని, కానీ ఎనిమిది రోజులు గడిచినా ఇప్పటికీ 10 మోటార్లు కూడా స్టార్ట్ కాలేదని ఎద్దేవా చేశారు. మంత్రులు వెళ్లిన రోజు ఏడు మోటార్లు నడిస్తే, తెల్లారేసరికి అవి ఐదుకి పడిపోయాయని, కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప చేతల్లో శూన్యమని అన్నారు.

Advertisement
Harish Rao
Uttam Kumar Reddy
Devadula Project
Telangana Farmers Water Crisis
BRS vs Congress Telangana
Devadula Reservoir Motors

More Telugu News