Advertisement

నీట్ లీకేజీ వ్యవహారం.. కేంద్రం కీలక ప్రకటన

NEET leakage issue Center key announcement
  • నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంటులో చర్చకు సిద్ధమన్న కిరణ్ రిజిజు
  • చర్చతోనే విద్యార్థుల్లో విశ్వాసం పెరుగుతుందని వ్యాఖ్య
  • విపక్షాలు షరతులు విధిస్తున్నాయంటే చర్చను కోరుకోవడం లేదని అర్థమని వ్యాఖ్య
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై పార్లమెంటులో సమగ్రంగా చర్చించేందుకు తాము సిద్ధమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశంపై సభలో పారదర్శకంగా చర్చించడం ద్వారా విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించవచ్చని ఆకాంక్షించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది.

విద్యార్థుల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని కిరణ్ రిజిజు ప్రకటించారు. పేపర్ లీకేజీ అంశంపై సభలో లోతైన చర్చ జరగాలని తాము కోరుకుంటున్నామని, ఈ సందర్భంగా ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను నిరభ్యంతరంగా వినిపించవచ్చని సూచించారు. అయితే, చర్చకు షరతులు విధించడం అంటే వారు చర్చను కోరుకోవడం లేదనే అర్థం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఏ సమస్య నుంచి పారిపోదని, అన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లేదా అఖిలేష్ యాదవ్ వంటి నేతలు ఎవరైనా ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని, అయితే సభా నిబంధనల ప్రకారమే చర్చ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. మరోవైపు, నీట్ పరీక్ష లీకేజీపై చర్చ జరిగే తేదీ, సమయాన్ని నిర్ణయించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను ప్రభుత్వం కోరింది.
Advertisement
Kiren Rijiju
NEET Paper Leak
NEET Exam Controversy
Parliament NEET Debate
Dharmendra Pradhan

More Telugu News